ఈ గెలుపు బలుపు కాదు వాపు!

హైదరాబాద్, 5 ఫిబ్రవరి 2013 : ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సీజీసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ సవాలు విసిరారు. ప్రభుత్వం మైనారిటీలో పడినప్పటికీ సిగ్గు లేకుండా అధికారంలో కొనసాగుతున్నారని ఆయన కాంగ్రెస్ తీరును దుయ్యబట్టారు.
కుట్రలతో, కుతంత్రాలతో, బోగస్ ఓటింగ్‌తో, అధికార దుర్వినియోగంతో సహకార ఎన్నికల్లో సాధించిన గెలుపు కేవలం వాపే తప్ప బలుపు కాదని ఆయన అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే జనాభిప్రాయం ఏమిటో వెల్లడి అవుతుందన్నారు. సహకార ఎన్నికల్లో అక్రమాలను గమనించి పార్టీ పరంగా బరిలో దిగబోవడం లేదని ముందుగానే తాము ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే పట్టభద్రుల నియోజకవర్గాల వంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము అభ్యర్థులను నిలపబోవడం లేదన్నారు. కానీ ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తప్పక పాల్గొంటుందని బాజిరెడ్డి చెప్పారు. తెలంగాణకు సంబంధించి కేంద్రం ఒక తండ్రిలాగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రకటిస్తే నష్టపోయినవారికి ప్యాకేజ్ వంటిది ఇవ్వవచ్చునన్నారు.
"సహకార ఎన్నికల్లో తామే గెలిచామని డబ్బా కొట్టుకుంటున్నారు. పోయిన పరపతి తిరిగి వచ్చిందన్న రీతిలో వచ్చే ఎన్నిక్లలోనూ తామే గెలుస్తామనీ కలలుగంటూ ఊహల్లో విహరిస్తున్నారు. సహకార ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలను గమనించాక ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, స్థానికంగా ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చుననీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ముందుగానే ప్రకటించింది. దాని వల్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు. అలా 250 వరకు సంఘాలను వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది" అని బాజిరెడ్డి వివరించారు.
సహకార ఎన్నికల్లో అడ్డదార్లు తొక్కారనీ, షెడ్యులు ప్రకటించాక హడావుడిగా 10 లక్షల 30 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నారనీ ఆయన ఆరోపించారు. 70 శాతం మంది ఓటర్లు నిజానికి అనర్హులనీ, లోన్లు తీసుకుని డిఫాల్ట్ అయినవారికి ఓటు హక్కు ఉండదనీ  కానీ వారితోనూ ఓట్లు వేయించారనీ ఆయన విమర్శించారు.
"లెడ్జర్ పుస్తకాలు సైతం కాంగ్రెస్ వారి ఇళ్లలో ఉంచుకున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసులను ఉపయోగించుకుని రిగ్గింగ్ చేశారు.డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేల దాకా పెట్టి కొనుగోలు చేశారు. వైయస్ హయాంలో బోగస్ ఓటింగ్ ఉండేది కాదు. నాడు కేవలం రైతులే ఓటర్లు. కానీ ఆ స్ఫూర్తి నేడు లోపించడం దురదృష్టకరం. ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర నేతలు సహకార ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికలకు వారు ఎందుకు వెనకాడుతున్నట్లు?" అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం మైనారిటీలో పడిందని తేలిపోయినా, సిగ్గు లేకుండా ఏదో రకంగా అక్రమాలకు పాల్పడి ఇలాంటి చిన్న చిన్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఏదో రకంగా గెలిచామని చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. వైయస్ హయాంలో సహకార ఎన్నికలు ఎలా జరిగాయో, ఇప్పుడెలా జరిగాయో ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
"ఈ ప్రభుత్వం కేవలం చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే కొనసాగుతోంది. పైగా శవయాత్ర వంటి పాదయాత్ర చేస్తున్నారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం వెంటనే పడిపోక తప్పదు. అప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ రెండో స్థానానికి పడిపోతుంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పరిపాలన లాగానే కిరణ్  కుమార్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు." అని ఆయన అన్నారు.
"దమ్మూధైర్యం ఉంటే జనం పాల్గొనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. లేదా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధం కావాలి. సహకార ఎన్నికల్లో తాము గెలవలేమనుకున్న157 స్థానాలలో ప్రభుత్వం ఎన్నికలను నిలిపి వేసింది. సభ్యత్వ నమోదు ఏకపక్షంగా సాగింది. 30 శాతం ఓట్లు షెడ్యూలు విడుదల అయ్యాక చేర్చారు. నష్టాల్లో ఉన్న సహకార సంఘాలకు రూ. 1800 కోట్లు వైయస్ ఇచ్చారు. అలాంటి ఆలోచన ఏదీ ఈ ప్రభుత్వానికి లేదు. తుఫాను వల్ల నష్టపోయినవారికి ఇంతదాకా పరిహారం ఇవ్వనేలేదు. కోనసీమలో క్రాప్ హాలీడే కూడా ప్రకటించారు. అది ఈ ప్రభుత్వ వైఖరి వల్లే జరిగింది. సహకార ఎన్నికల్లో గెలుపు బలుపు కాదు, వాపు మాత్రమే.
బోగస్ గెలుపు. దీనికి విర్రవీగాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ బలానికి సంకేతం కాదు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నాఅసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. అప్పుడు గెలిస్తే ప్రజామోదం ఉన్నట్లవుతుంది. అంతేతప్ప సహకార ఎన్నికల గెలుపు పరిపాలన తీరుకు కొలమానం కాదు" అని బాజిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top