బాబు బినామీల గుప్పిట్లో విద్యావ్యవస్థ

– దోపిడీకి ఆంధ్రాను స్వర్గధామం చేశారు 
– ప్రతి విద్యార్థి మరణం వెనుక సర్కారు నిర్లక్ష్యం
– రాష్ట్రంలో కార్పొరేట్‌ చదువు మాఫియా నడుస్తోంది
– రిషితేశ్వరి తల్లిదండ్రులకు ప్లాటు ఆశ జూపి నోరు మూయించబోయారు
– నిందితుడు బాబూరావుకు సైన్స్‌ కాంగ్రెస్‌లో అందలం
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే వ్యవస్థను మార్చేస్తాం
– పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

హైదరాబాద్ః నానాటికీ నిర్వీర్యమైపోతున్న విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల అకాల మరణాలకు కారణం అవుతున్న నారాయణ, చైతన్య భూతాన్ని వదలగొట్డడానికి విద్యార్థి సంఘాలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరులో శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దంపతుల కుటుంబానికి వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొడుకే ఆశగా బతుకుతున్న తల్లిదండ్రులు చివరకు అతడు లేడన్న నిజాన్ని తెలుసుకుని జీర్ణించుకోలేక పోరాటం చేసి అలసిపోయి ఇక న్యాయం జరగదని గ్రహించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రతి ఒక్కర్నీ కన్నీరు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బినామీ నారాయణ, ఆయన నడిపే నారాయణ విద్యాసంస్థలు, వారితో భాగస్వామ్యం ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలు, నారాయణ వియ్యంకుడు.. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌ తదితరులు కాసుల కోసం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎంతోమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమవుతున్న వీరికి బుద్ధి చెప్పాలంటే విద్యార్థి సంఘాలు వైయస్‌ఆర్‌సీపీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో కూడా విద్యార్థుల ఆత్మహత్యలపై సర్కారును తప్పకుండా నిలదీస్తామని హెచ్చరించారు. తన హయాంలో 80 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ఏం మేలు చేశావరని ప్రజలు సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు. 

విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి
ఫీజుల కోసం తల్లిందండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్‌ భూతాన్ని తరిమికొట్టి తక్షణమే విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తమ బిడ్డలు చదువుకుని ఉన్నతంగా స్థిరపడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పిస్తుంటే నారాయణ, చైతన్య వంటి సంస్థలు వారిని శవాలుగా అప్పగిస్తున్నారని.. విద్యార్థుల మరణమృదంగానికి అడ్డుకట్ట వేయడానికి తల్లిదండ్రుల పక్షాన పోరాడతామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలను బలోపేతం చేస్తే ఎక్కడ తన బినామీ కార్పొరేట్‌ కాలేజీలకు డిమాండ్‌ తగ్గిపోతుందనే భయంతోనే నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. నోబెల్‌ బహుమతి తెచ్చేవారికి వంద కోట్లు కేటాయిస్తామని మీటింగ్‌ల్లో చెప్పడం కాదని ఆ బహుమతులు తీసుకొచ్చేలా విద్యావ్యవస్థను పట్టిష్టం చేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపేలా సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని హితవు పలికారు. నాటి శ్రీనివాస రామానుజన్, అంబేడ్కర్, జేసీ బోస్‌ నుంచి నేటి సుందర్‌ పిచాయ్‌ వరకు ఎంతోమంది సర్కారు బడుల్లోనే చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్న వారేనని తెలిపారు. రాష్ట్రంలో విద్యా మాఫియా నడుస్తోందని, దోపిడీకి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్గధామం చేశారని మండిపడ్డారు. 

విద్యార్థుల మరణమృదంగం ఆగేదెప్పుడో..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల మరణ మృదంగం నడుస్తుందని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు కాలేజీల వేధింపులకు బలవుతున్నారని తెలిపారు. మొన్నటి రిషితేశ్వరి ఘటన నుంచి నిన్నటి విద్యార్థి తల్లిదండ్రుల ఆత్మహత్య వరకు ప్రతి మరణం వెనుక సర్కారు నిర్లక్ష్యం ఉందన్నారు. శ్రీచైతన్యలో చోటు చేసుకున్న కొడుకు మరణంపై విచారణ జరిపి నిజానిజాలను తెలియజేసి ఉంటే ఆ దంపతులు ఉరేసుకుని తనువు చాలించాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఇది ముమ్మాటికీ సర్కారు నిర్లక్ష్యమేనని తెలిపారు. రిషితేశ్వరి చనిపోతే ఆమె మృతికి కారణమైన బాబూరావును రక్షించేందుకు ఆమె తల్లిదండ్రులకు ప్లాటు ఇవ్వజూపడం దారుణమన్నారు. ప్రొఫెసర్‌ లక్ష్మిని కాపాడటానికి ఎన్ని పాట్లు పడ్డారో జనం చూశారు.. ఇలా ఒక్కొక్కరి మరణం వెనుక సర్కారు చేతకానితనం నిందితులకు అండదండలు ఇవ్వడమే కారణమన్నారు. చంద్రబాబు హయాంలో సామాన్యులకు బతికే హక్కు కూడా లేకుండా పోతోందని విమర్శించారు. 

అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన చేస్తాం
వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎక్కడ అపార్ట్‌మెంట్‌ కనబడితే అక్కడ పాఠశాలలు నడిపిస్తున్న ఘటనలు రానివ్వబోమన్నారు. ఫీజల కోసం వేధించుకు తింటున్న వ్యవస్థను రూపుమాపుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మారిన విద్యావ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కూడా మార్చుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసేసి ఉపాధ్యాయులను కూడా ఇంటికి సాగనంపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాన్ని, విద్యార్థి సంఘాలను అణచివేసేందుకు తప్ప పోలీసు యంత్రాంగం దేనికీ పనికిరావడం లేదని ఆరోపించారు. ఏ దేశం వెళ్లొచ్చి ఆ దేశంలా రాష్ట్రాన్ని మారుస్తామంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు మీరేం మార్చాల్సిన పనిలేదు.. మన రాష్ట్రాన్ని ఆంధ్రాలాగే ఉంచితే చాలని కోరారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల పేరుతో చంద్రబాబు సింగపూర్‌ వెళ్లి ఇక్కడ దోచుకున్న నల్లధనం సరిగ్గా ఉందో లేదో చూసుకుని వస్తారని ఎద్దేవా చేశారు. 
Back to Top