కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి

రెండ్రోజులు చూసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం
అప్పటికీ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం
రాష్ట్ర స్పీకర్ గా కొనసాగే అర్హత కోడెలకు లేదుః అంబటి

గుంటూరు: గత ఎన్నికల్లో  రూ.11.50 కోట్లు ఖర్చుచేసినట్లుగా సత్తెనపల్లి శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నందున ...ఎలక్షన్ కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సుమోటోగా తీసుకొని కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు.  ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని వేచిచూస్తున్నామన్నారు. మరో రెండు రోజులు చూస్తామన్నారు. సుమోటోగా తీసుకొని విచారించకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామన్నారు. అప్పటికీ చర్యలు చేపట్టకపోతే  న్యాయపరంగా వైయస్సార్ సీపీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.11.50 కోట్లు ఖర్చుపెట్టానన్న తర్వాత కూడా శాసనసభ్యుడిగా, స్పీకర్‌గా పనికి వస్తారా అనే విషయం ప్రజలు గమనించాలన్నారు.  సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top