ఈ పాస్ విధానం ప్రమాదకరం

రెవెన్యూ యంత్రాంగానికి
రైతుల పీకలు అప్పగిస్తున్న బాబు
పాస్‌బుక్‌ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏంటీ..?
ఇంట్లో ఎలుక దూరిందని ఇళ్లు తగులబెట్టినట్టుగా ఉంది బాబు తీరు
రైతులకు కంప్యూటర్, ఇంటర్‌నెట్‌ గురించి తెలుసా
భవిష్యత్తులో ఈ–పాస్‌బుక్‌తో విచ్చలవిడిగా అవినీతి
వైయస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు మలిరెడ్డి వీరశంకర నాగిరెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు ఈ పాస్‌ పుస్తకం విధానం ద్వారా రైతుల పీకలను రెవెన్యూ యంత్రాంగం చేతులకు అప్పగిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్. వీ.ఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్ణయం ద్వారా రైతులకు జరుగుతున్న అన్యాయాలపై హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతుల భూముల హక్కుకు సంబంధించి పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మొట్టమొదటి సారిగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పట్టాదారు పాస్‌పుస్తకాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆయన హయాంలో ఈ కార్యక్రమం అంతగా ఫలించకపోవడంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్‌ పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్‌ హక్కును రైతులకు కల్పించాడని చెప్పారు. 1986 నుంచి ఉన్న పాస్‌ పుస్తకం విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఏ రైతు సంఘం, రైతులు రద్దు చేయమని అడగకుండా ఈ–పాస్‌ విధానాన్ని ఎలా అమలు చేస్తారని నిలదీశారు. రెవెన్యూ యంత్రాంగంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని రెవెన్య శాఖా మంత్రి చెప్పడం ఆశ్యర్యంగా ఉందన్నారు.  ఒక జిల్లాలో దొంగ పాస్‌ పుస్తకాలు వచ్చాయని, పాస్‌పుస్తకాలను, టైటిల్‌ డీడ్స్‌ను రెండింటిని రద్దు చేసి మొత్తం రాష్ట్రంలో ఈ–పాస్‌పుస్తకం విధానం పెట్టడం ఎంతవరకు సబబు అని మండిపడ్డారు. ఇంట్లో చుంచు ఎలుక దూరిందని ఇంటిని మొత్తం తగలబెట్టినట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.  పేదరికం నిర్మూలన కావాలంటే కంప్యూటర్‌లు, ఇంటర్‌నెట్‌ల మూలంగా నిర్మూలన కాదు.. రైతు ఇంటికి పది కోళ్లు ఇస్తే పేదరికం నిర్మూలన అవుతుందని టెక్నాలజీలో ప్రపంచ దిగ్గజం బిల్‌గెట్స్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు అవేవి పట్టించుకోకుండా ఆకాశంలో నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ పాస్‌ పుస్తకం విధానానికి మారుస్తూ ఈ నెల 18వ తేదిన జీవో నెంబర్‌ 255ను ఎమర్జెన్సీ గజెడ్స్‌ నుంచి విడుదల చేశారని చెప్పారు. ఈ రోజు వరకు జీవో గురించి ఒక్క రైతు సంఘానికి కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. 18వ తేది నుంచి 30వ తేది వరకు జీవోపై అభ్యంతరాలు తెలియజేయాలని ఉన్నప్పటికీ మీడియాకు కూడా జీవోను విడుదల చేయకుండా సీక్రెట్‌గా విడుదల చేసిందని ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి, 48 శాతం ప్రత్యక్ష రైతులు ఉన్నా ఇంత ముఖ్యమైన జీవోపై పబ్లిసిటీ చేయకపోవడం ప్రమాదకరమని ధ్వజమెత్తారు. 

నా పరిస్థతితే ఇలా ఉంటే మరి రైతుల పరిస్థతి
ఈ పాస్‌పుస్తకం విధానం ద్వారా భూమి యజమానికి తెలియకుండా వేరొకరు లోన్‌ తెచ్చుకొని, అమ్మేసుకునే పరిస్థతి ఉందని నాగిరెడ్డి విమర్శించారు. కృష్ణా జిల్లా పాములపాడు గ్రామంలో తనపేరు మీద ఉన్న భూమిపై కంప్యూటర్‌లో ప్రింటవుట్‌ తీస్తే మూలిపూరి వెంకట రాజబాబు అనే పేరుతో భూములు గల్లంతైయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోస్ట్‌ గ్రాడ్యూయేషన్, గత 15 సంవత్సరాల నుంచి రైతు నాయకుడిగా ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే రైతుల పరిస్థతి ఏంటని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈపాస్‌ పుస్తకం అభ్యంతరాల గడువుదాటాక తన భూమిపై పేరున్న వ్యక్తి బ్యాంక్‌లో లోన్‌ తెచ్చుకొని, అవసరమైతే భూమిని అమ్ముకునే అవకాశం కూడా ఉందని మండిపడ్డారు. ఈ పాస్‌ విధానాన్ని తయారు చేసిన అధికారితో మాట్లాడితే అదెలా సాధ్యమని మాటలు తోసిపుచ్చుతున్నారని, తప్పుడు పేరుతో వచ్చిన తన భూమి పట్టాల ఆధారాలను మీడియా ముందు ఉంచారు. 

మరో టైటిల్‌ డీడ్‌పై తన తండ్రిపేరు రాంమ్మోహన్‌రెడ్డికి బదులుగా రాంమ్మోహన్‌రావుగా నమోదు చేశారని చెప్పారు. భవిష్యత్తులో భూమిని విక్రయించాలంటే తండ్రి పేరు తప్పుగా ఉంది మీ తండ్రి రాంమ్మోహన్‌రావు అని సర్టిఫికేట్‌ తీసుకురా అంటే ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ విధానం ద్వారా భవిషత్తులో రెవెన్యూ శాఖాలో అవినీతి మితిమీరుతుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన కూడా చేయకుండా నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. టెక్నాలజీ వాడటానికి ఎవరూ అడ్డుచెప్పడం లేదు కానీ ఉన్న వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఉండాలి కానీ నీరుగార్చే పని చేయోద్దని హితవుపలికారు. గ్రామీణ ప్రాంతంలో ఎంత మంది రైతులకు కంప్యూటర్, ఇంటర్‌నెట్‌ గురించి తెలుసని చంద్రబాబును ప్రశ్నించారు. 98 శాతం మంది రైతులకు కంప్యూటర్‌ వ్యవస్థ గురించి తెలియదని చెప్పారు. ఇంట్లో ఉన్న భూమి కాగితాలను రైతులకు తెలియకుండా సర్వే నెంబర్‌లలో పేర్లు మార్చడం ఎంటని ప్రశ్నించారు. 

తనకు జరిగిన పరిస్థితే సామాన్య రైతులకు జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిచారు.  రెవెన్యూ సిబ్బందిని మ్యానేజ్‌ చేసుకొని ఆ భూములు అమ్మేసుకుంటే రైతులకు దిక్కెవరని విరుచుకుపడ్డారు. దొంగ పాస్‌పుస్తకాలు తీసుకువచ్చిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి కానీ ఈ పాస్‌పుస్తకం విధానం ప్రవేశపెట్టడం అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, రైతులకు ప్రమాదకరంగా ఉన్న కార్యక్రమాలు చేపట్టవద్దని కోరారు.  ఆకాశంలో పరుగులెత్తడం మాని క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగూనంగా నడవాలని సూచించారు. ఇప్పటికైనా గ్రామంలో రైతుల ఇంటింటికి రెవెన్యూ సిబ్బందిని పంపించి రైతులకు యాజమాన్య హక్కు పత్రాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు తీసుకున్న ఈ–పాస్‌పుస్తకం విధానంపై జులై 1వ తేదిన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్షాల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతు సంఘాలు కూడా పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రైతులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. పట్టాదారు రైతులంతా వచ్చేటప్పుడు మీ సేవలో టైటిల్‌ డీడ్‌ వివరాల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. 
Back to Top