భూములు కొట్టేయడానికే ఈ–పాస్‌బుక్‌

  • ఈ–పాస్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
  • కార్పొరేషన్‌ శక్తులకు లబ్ది చేకూర్చేందుకే ఈ నిర్ణయం
  • రిజిస్ట్రేషన్‌లో రైతుల భూములు గల్లంతైతే బాధ్యులెవరు
  • జీవో నంబరు 271 నిలుపుదల చేయాలి
  •  వైయస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

హైదరాబాద్‌: రైతుల భూములను అన్యాయంగా కొట్టేయడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ–పాస్‌బుక్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అనతికాలంగా వస్తున్న రైతుల హక్కులు టైటిల్‌ డీడ్, పాస్‌బుక్‌ విధానాన్ని బదాలాయించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రాష్ట్ర రైతాంగంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

పాస్‌బుక్, టైటిల్‌ డీడ్‌ రద్దు చేస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పినా  వినిపించుకోకుండా ఈ నెల 1వ తేదిన తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరుస్తూ ప్రభుత్వం 271 జీవోను విడుదల చేసిందని మండిపడ్డారు. ఈపాస్‌ విధానంతో రెవెన్యూ శాఖలో విచ్చల విడిగా అవినీతి జరుగుతుందని ప్రభుత్వ అనుకూల పత్రికలే కథనాలు రాస్తున్నాయని ఆధారాలను మీడియా ముందు ఉంచారు. 271 జీవో ద్వారా 1బి రిజిష్టర్‌ ద్వారా రిజిస్ట్రే షన్స్‌ జరిగితే ప్రభుత్వ ఆస్తులన్ని చేజారి పోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ–పాస్‌బుక్‌ విధానంతో  రైతుల భూములు వేరొకరి పేరు మీద రిజిస్టర్‌ అయితే దానికి బాధ్యులు ఎవరని ప్రభుత్వంపై ఫైరయ్యారు. రైతులకు యాజమాన్య హక్కులేకుండా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, రెవెన్యూమంత్రి బాధ్యత వహిస్తారా సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ–పాస్‌ విధానానికి మార్చమని రైతు సంఘాలు అడిగాయా అని ప్రశ్నించారు. దేశంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హరిత విప్లవాన్ని తీసుకువస్తే, లాల్‌ బహదూర్‌శాస్త్రి జై జవాన్, జై కిసాన్‌ నినాదంతో ముందుకుపోతే చంద్రబాబు రైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుది మంచి నిర్ణయం కాదని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నబాబు 
వారసత్వంగా వస్తున్న భూములను నమ్ముకొని బతుకుతున్న రైతుల ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం దెబ్బకొడుతుందని నాగిరెడ్డి మండిపడ్డారు. వెబ్‌ ల్యాన్‌లో మీ భూములు మీ ఇంటికి అని పెట్టారు కానీ జరిగేది అందుకు విరుద్ధంగా మీ భూములు మా ఇంటికి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతు సంఘాలతో కలిసి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొండూరు గ్రామంలో సర్వే చేపట్టామని చెప్పారు. గ్రామంలో 250 అకౌంట్లు ఉంటే వాటిలో 140 రైతుల అకౌంట్లు పూర్తిగా తప్పుల తడకలతో ఉన్నాయన్నారు. భూముల యజమానుల పేర్లతో కాకుండా వేరే వారి పేర్లతో గల్లంతైయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా రెవెన్యూ శాఖలో నిజాయితీగా ఉన్న అధికారులు కూడా భయపడిపోతున్నారని పేర్కొన్నారు. 

కొన్ని కార్పొరేషన్‌ శక్తులకు భూములను ధారాదత్తం చేసేందుకే 271 జీవో విడుదల చేశారని ఆరోపించారు. 1బి రిజిస్టేషన్‌ ద్వారా ప్రభుత్వ, దేవాలయాల భూములన్ని అన్యాక్రాంతం అవుతాయని ధ్వజమెత్తారు. పత్రికల్లో వాస్తవాలు వచ్చినప్పటికీ మొండితనంగా వెళ్లడం మంచిదికాదని, మీ కోటరీకి లబ్ది చేకూర్చడానికే నిర్ణయం తీసుకున్నట్లు ప్రజల్లో భావన కూడా ఉత్పన్నమవుతోందని విమర్శించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇంత వరకు వాటిని నెరవేర్చకపోగా రైతుల భూములను కొట్టేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆరోపించారు. వెంటనే 271 జీవో అమలును నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఇంట్లో ఉన్న యాజమాన్యం హక్కు పత్రం, పాస్‌బుక్‌ వాటి ద్వారా లావాదేవీలు జరిగే విధంగా చూడాలన్నారు. లేనిపక్షంలో రైతులకోసం రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. 
Back to Top