దుర్గమ్మ భూములు ధారాదత్తం

-బాబూ... న్యాయమూర్తి చీవాట్లు మరిచావా 
– రాబడిలో రాష్ట్రం వాటా ఎంతో స్పష్టం చేయాలి 
– సీల్డ్‌ కవర్‌ తెరిచి నిజానిజాలు బయటపెట్టాలి
– పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు వేల కోట్ల విలువైన  విజయవాడ దుర్గమ్మ భూములను కూడా తన వారికి తక్కువ ధరకే దారాదత్తం చేయడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ నేత, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. రాజధాని ముసుగులో ప్రజా సందపను విచ్చలవిడిగా బినామీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్విస్‌ చాలెంజ్‌ పేరుతో ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి తెరతీసిందని ఆరోపించారు. ముక్కూ మొహం తెలియని సింగపూర్‌ కంపెనీలకు మన భూములను తాకట్టు పెట్టడానికి ఎందుకంత తపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్విస్‌ చాలెంజ్‌పై మీ విధానం మార్చుకోవాలని కోర్టులు సూచించినా చెవులకెక్కించకోకపోవడం దారుణమన్నారు. ఇది తప్పకుండా న్యాయస్థానాలను, ప్రజలను అగౌవరవ పరచడమేనన్నారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ సమాధానమిస్తూ రీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పడం మూర్ఖత్వమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రముఖులు అనాదిగా నీతి నిజాయితీలుగా కట్టుబడి పాలన కొనసాగించారని, బాబు ఆ సాంప్రదాయానికి విరుద్దంగా తను చెప్పిందే న్యాయం చేసిందే చట్టం అన్న తీరులో ఉన్నారని బుగ్గన ధ్వజమెత్తారు. 

రూ. 12 కోట్ల భూమి రూ. 4 కోట్లకిస్తారా..? 
పేద రైతుల నుంచి సేకరించిన 1691 ఎకరాల భూమిని స్విస్‌ చాలెంజ్‌ పేరుతో సింగపూర్‌ కంపెనీలకు కేటాయించేది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకేనని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. మన సొమ్ముతో నీరు, డ్రైనేజీ, రోడ్లు, గ్యాస్, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ఇస్తే వారు అమ్ముకుంటారా అని ప్రశ్నించారు. ఎకరా భూమిని రూ.4 కోట్లకే కట్టబెట్టడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఎకరా 12 కోట్లు విలువైన భూమిని రూ. 4 కోట్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పైగా భూములమ్ముకునే అవకాశం కూడా సింగపూర్‌ కంపెనీలకే ఇవ్వడంపై ఆయన ధ్వజమెత్తారు. పైగా ఈ అమ్మకాలకు సంబంధించి బిడ్డింగ్‌ లేదా నెగోషియేషన్‌ పేరుతో విధించిన నిబంధనలు కోర్టులను కూడా బురిడీ కొట్టించేవిగా ఉన్నాయన్నారు. నెగోషియేషన్‌ పేరుతో ఆ భూమిని రూ. 4.10కోట్లకు అమ్మే కుట్ర జరుగుతుందన్నారు. మన సొంత ఖర్చులతో అభివృద్ధి చేసిన భూముల్లో కూడా మనకేమో 48 శాతం వాటా సింగపూర్‌ కంపెనీలకు మాత్రం 42 శాతం వాటా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సింగపూర్‌ కంపెనీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలు చేర్పించి 58 శాతం  వాటాలు నిర్ణయించారని తెలిపారు. ప్రజలను సింగపూర్, న్యూయార్క్‌ కడతామని మభ్యపెట్టి రియల్‌ వ్యాపారం చేయడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శించారు. 1691 ఎకరాల భూములతోపాటు మౌలిక సదుపాయాలకు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి 48 శాతం వాటా.. రూ. 306 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కంపెనీలకు 58 శాతం వాటానా అని ప్రశ్నించారు. 

దేవుడి భూములూ వదలవా...
చంద్రబాబు ధన దాహం ముందు పట్టిసీమ పేరుతో దోచుకున్న రూ. 500 కోట్ల కుంభకోణం కూడా చాలా చిన్నదని వైయస్‌ఆర్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. బాబు భూ దాహానికి దేవుడి భూములు కూడా మిగిలే పరిస్థితి కనబడటం లేదన్నారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు ఎలాగూ సమాధానాలు చెప్పడం లేదు.. కాగ్, న్యాయస్థానాలకు కూడా సమాధానం చెప్పవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కట్టబెట్టాలంటే ఒక విధానం ఉంటుందని కానీ బాబు తన అవసరాల కోసం వాటికి తూట్టు పొడిచారన్నారు. ముందుగా సీఆర్‌డీఏ, ఆ తర్వాత ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్ణయాలు తీసుకుని చివరిగా ప్రభుత్వానికి నివేదిస్తాయని కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం నడిచిందన్నారు. ప్రభుత్వమే అన్ని నిర్ణయాధికాకాలు  తీసుకుని చివరిగా సీఆర్‌డీఏకు ఆదేశాలు ఇచ్చేటట్లయితే ఆయా అవన్నీ ఎందుకున్నట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఓటుకు డబ్బులిచ్చామని ఒప్పుకున్నట్టేనా..?
‘ఓటుకు నోటు’ కేసు విచారణ సందర్భంగా సీఎం చంద్రబాబు తరఫున వాదించిన లాయర్‌ సిద్దార్థ లూథ్రా మాట్లాడుతూ ఓటుకు డబ్బులివ్వజూపడం తప్పుకాదని చెప్పడాన్ని బుగ్గన తీవ్రంగా ఆక్షేపించారు. విచారణ సందర్భంగా లూథ్రా చెప్పిన కథపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటేయడానికి లంచం తీసుకోవడం తప్పుకాదని రాజ్యాంగ విరుద్ధంగా ఆయనెలా మాట్లాడతారని ఆరోపించారు. డబ్బులివ్వడం తప్పుకాదని కోర్టు సాక్షిగా పేర్కొనడం చూస్తుంటే మీరు ఎమ్మెల్యేను కొనడానికి డబ్బులిస్తున్నట్టు ఒప్పుకున్నట్టేగా అని ప్రశ్నించారు.

కోర్టులకు కూడా నిజాలు చెప్పరా 
స్విస్‌ చాలెంజ్‌పై జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించిన కోర్టుకు కూడా ప్రభుత్వం నిజాలు చెప్పడం లేదని బుగ్గన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏ మేరకు లబ్ధి చేకూరనుందని కోర్టులు అడిగిన ప్రశ్నకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అది ప్రభుత్వానికే తెలియదని, సీల్డ్‌ కవర్‌లో ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. హైకోర్టులో కేసు నడుస్తుండగా నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించిన అంశాన్ని అప్పుడే మర్చిపోయారు అని ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న సింగపూర్‌ కంపెనీలకు బిడ్డింగ్‌కి ఐదు నెలల సమయం కేటాయించిన మీరు మన దేశీ కంపెనీలకు కేవలం పదిరోజులు సమయమియ్యడం సిగ్గు చేటన్నారు. బిడ్డింగ్‌కు పిలిచేందుకు మొదట ఆసక్తి అని తర్వాత అర్హత నిబంధనలు మార్చడం సింగపూర్‌ కంపెనీలకు లబ్ధిచేకూర్చేందుకేనని దుయ్యబట్టారు. విదేశాల్లో పనిచేసి వారికి ఉద్యోగాలిచ్చిన కంపెనీలకే అర్హత ఉన్నట్టా అని ప్రశ్నించారు. అర్హత లేకపోయినా విదేశీయులైతే చాలా ప్రశ్నించారు. మన దేశీ కంపెనీలు, ఇంజినీర్లను అర్హత నిబంధనల పేరుతో అవమానించడం తగదని హితవు పలికారు. ఇదంతా సేల్స్‌మెన్‌ ఉద్యోగానికి పాటలు పాడగలవా అని అడిగినట్టుందని ఎద్దేవా చేశారు. 

న్యాయమూర్తి చీవాట్లు అప్పుడే మరిచావా బాబు
స్విస్‌ చాలెంజ్‌ విచారణ సందర్భంగా మీ ఏజీ వాదనలను తప్పుబడుతూ న్యాయమూర్తి మీ లాయర్‌కు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన విషయం అప్పుడే మరిచావా బాబూ.. అని బుగ్గన చంద్రబాబును విమర్శించారు. సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోతోంది అందుకే ప్రత్యేక సందర్భాల్లో కలుగజేసుకోవాల్సి వచ్చిందని న్యాయమూర్తి అన్న మాటలు గుర్తులేవా అని అడిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తి అన్న మాటలకు సమాధానం ఏదన్నారు. రాబడిలో రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఎంతో చెప్పాలని న్యాయమూర్తి అడిగినప్పుడు సీల్డ్‌ కవర్‌లో ఉంది.. ప్రభుత్వానికే తెలియదని మీ ఏజీ చెప్పిన సమాధానానికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం గుర్తులేదా అన్నారు. స్విస్‌ చాలెంజ్‌ విధానం లోపభూయిష్టంగా ఉంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కలగజేసుకుంటున్నాం అని అనలేదా..? అని వివరించారు. మీ విధానాలన్నీ బండిని గ్రురం ముందర కట్టేసినట్లుందని న్యాయమూర్తి విమర్శించిన విషయం గుర్తులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసక్తి నిబంధనలను అర్హత పేరుతో సవరించడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టడం మరిచారా అనడిగారు. మన దేశీ కంపెనీలపై కేసులున్నాయని ఏజీ పేర్కొన్నప్పుడు మీరు చెప్పిన సింగపూర్‌ కంపెనీలకు కూడా బ్రెజిల్‌లో అవినీతి కేసులున్నాయని సాక్షాత్తు న్యాయమూర్తే చెప్పిన విషయంపై ఏం సమాధానమిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంపదకు సంరక్షకులుగా ఉండాలి కానీ నష్టం చే కూర్చేదిగా ఉండరాదని హైకోర్టు న్యాయమూర్తి మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పుడే మరిచిపోతే ఎలా అన్ని బుగ్గన ప్రశ్నించారు. 

మన సీఎంల సాంప్రదాయాన్ని పాటించండి
మన మాజీ ముఖ్యమంత్రులు ఎంతో విలువైన పరిపాలన చేశారని వారి అడుగుజాడల్లోనే నడిచి సాంప్రదాయాన్ని విలువలను కాపాడాలని ముఖ్యమంత్రికి బుగ్గన హితవు పలికారు. ఈ సందర్భంగా పలు ఉదాహరణలు తీసుకొచ్చారు. గతంలో నీలం సంజీవరెడ్డి రోడ్లను జాతీయం చేస్తే కోర్టు ఆక్షేపించగా రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 మెడికల్‌ కళాశాలలకు లైసెన్సులు ఇచ్చినప్పుడు తమకు చెందిన ఓ కాలేజీ ఉందని విమర్శలు వెల్లువెత్తినప్పడు ఆయన రాజీకొచ్చారని బుగ్గన  పేర్కొన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి, మంత్రులు కోర్టులు అభ్యంతరం తెలిపితే కేసు కోర్టులో ఉండగానే చట్టాలకే సవరణలు చేయడం సిగ్గుచేటన్నారు. పైగా మళ్లీ కొత్త నోటిఫికేషన్‌తో వస్తామని మంత్రి నారాయణ చెప్పడం న్యాయవ్యవస్థ అంటే వారికెంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు. నీతి నిజాయతీలుంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
 

తాజా ఫోటోలు

Back to Top