ధూళిపాళ్ల ‘పోరంబోకు’ కథ!

• అనధికారికంగా కొట్టేసింది 50 ఎకరాలు
• రిజిస్ట్రేషన్ చేయించుకుంది 3.89 ఎకరాలు

రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూకబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చివరకు వాగు, డొంక, చెరువు పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. కన్పించిన భూమినంతా కబ్జా చేసి.. రెవెన్యూ రికార్డులను తిరగరాయించి బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అనుచరుల తీరే తార్కాణం. రాజధాని ప్రకటనతో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాగు పోరంబోకు భూములపై ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కన్ను  పడింది.
 
ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్
నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్  చేసేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కొడుకు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) రిజిస్ట్రేషన్‌లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్‌లు పుట్టించారు. ఆ తరువాత ఈ ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవర పుల్లయ్యకు విక్రయించినట్లు సృష్టించారు.  ఎమ్మెల్యే ధూళిపాళ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బి6, బి7, బి8 సబ్ డివిజన్లుగా విభజించి దేవర పుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.  ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది.


మొత్తం 50 ఎకరాల పోరంబోకు కబ్జా
ఈ భూమిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో ఆ భూమిలో బోర్లు వేసి, సాగుచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోరు వేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వీఆర్వోకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఈ భూమి వాగు పోరంబోకు అని గ్రామ ప్రజలందరికీ తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి వారిది. అడ్డుతగిలితే తప్పుడు కేసులు పెట్టించడం, లేదా దాడులు చేయించడం వంటివి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్క పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేయడం కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. 
 
Back to Top