'దుబాయ్ బాధితుల‌ దుస్థితి పట్టని ప్రభుత్వం'

హైదరాబాద్, 3 ఫిబ్రవరి 2013:‌ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ పని లేక, తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక అష్టకష్టాలు పడుతున్న రాష్ట్ర వలస కార్మికులను కిరణ్‌ కుమార్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కె.కె. మహేందర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దుబాయ్‌ బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ‌ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వేలాది మంది మన రాష్ట్రానికి చెందిన కార్మికులు గల్ఫులో మగ్గిపోతున్నారని మహేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షమాభిక్ష కింద స్వదేశానికి చేరుకునే భారతీయుల కోసం గల్ఫు ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ వరకు గడువు విధించిందని మహేందర్‌రెడ్డి తెలిపారు. అయినా తిరుగు ప్రయాణానికి డబ్బులు లేక చాలా మంది అక్కడే రహస్యంగా తలదాచుకోవలసి వచ్చిందని ఆయన తెలిపారు.

క్షమాభిక్షపై విడుదల కోసం గల్ఫు ప్రభుత్వం విధించిన గడుకు ఇంకా ఒక్క రోజే ఉందని మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటికే అక్కడ ఉన్నవారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులపై తీసుకురావాల్సిందన్నారు. రేపటితో గడువు ముగుస్తున్నందున మంత్రి శ్రీధర్‌బాబు గల్ఫు బాధితులను ఈ కొద్ది సమయంలో ఎలా తీసుకు రాగలరని మహేందరన్‌రెడ్డి మండిపడ్డారు.

గల్ఫు బాధితులను ఆదుకోవాలన్న కృతనిశ్చయంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉందని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ నుంచి ఒక బృందం గల్ఫు దేశాల్లో పర్యటించి, బాధితులకు తగిన సాయం అందించిందని, స్వయంగా విమానం టిక్కెట్లు కొని ఇచ్చి సుమారు 50మందిని కొద్ది రోజుల క్రితం తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌సిపి ‌ప్రవాసాంధ్ర విభాగం గల్ఫు బాధితులకు అండగా నిలుస్తోందన్నారు. గల్ఫు బాధితులను ఆదుకునే విధంగా ప్రభుత్వం శాశ్వత కార్యక్రమాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి మహేందర్‌రెడ్డి సూచించారు.

తాజా వీడియోలు

Back to Top