తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు

– వాడీ వేడిగా కౌన్సిల్‌ సమావేశం
కదిరి అర్బన్‌: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం జరిగిన అత్యవసర కౌన్సిల్‌ సమావేశం వాడీ వేడిగా జరిగింది. పాలకవర్గం పట్టణంలోని తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వైయస్సార్‌సీపీ కౌన్సిలర్‌లు ధ్వజమెత్తారు. గత నెల రోజులనుంచి పలు వార్డులో ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారం రోజులు వర్శాలు కురవకపోతే పార్నపల్లి తాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు. గతంలో పార్నపల్లి నీటి పథకం లేనప్పుడు పట్టణం చుట్టూ సుమారు 30 బోర్లతో నీటిని ప్రధాన ట్యాంకుకు పంపింగ్‌ చేసి సరఫరా చేసేవారని ప్రస్తుత పాలకులు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి బోర్లలో ఉన్న మోటార్లు,పైపులు నేడు లేవన్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు పట్టణంలోని తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ప్రధాన తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడ్డప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలతో ప్రజలకు తాగునీరు అందించడం పాలకవర్గం బాధ్యత అన్నారు. గతంలో కౌన్సిలర్‌లను పార్నపల్లి వద్దకు తీసుకెళ్లి అక్కడ నెలకొన్న సమస్యను చూపించారని, అయితే వాటి మరమ్మత్తుకు రూ. 2 లక్షలవరకు అవుతుందని అంచానా వేసిన అధికారులు ప్రస్తుతం రూ. 7 లక్షలు అవుతుందని అజెండాలో పెట్టడం చూస్తుంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. అలాగే కాంట్రాక్టు,అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పెంచడం ఎవరిని అడిగి ఈనిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలపాలని కౌన్సిలర్‌ జిలాన్‌ పట్టుబట్టారు. అవుట్‌సోర్సింగ్‌లో కార్మికులను తీసుకున్న కాంట్రాక్ట్‌ సంస్థకు కమీషన్‌ ఎందుకు పెంచారని ప్రశ్నించారు. వీటన్నింటిపై విజిలెన్స్‌ విచారణ చేయించాలని కౌన్సిలర్‌ మైనోద్దీన్‌ పట్టుబట్టారు. మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతిని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని చైర్‌పర్సన్‌ సురయాభాను వివరణ ఇచ్చారు. ఏదైనా అజెండా కౌన్సిల్‌మీట్‌లో పెట్టినపుడు అందుకు సంబంధించిన శాఖాధికారులు ఖచ్చితమైన సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కౌన్సిలర్‌లు డిమాండ్‌ చేశారు.టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అవసరానికి మించి సిబ్బంది పనిచేస్తున్నారని కౌన్సిలర్‌ జిలాన్‌ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విభాగంలో అవినీతి పెచ్చుమీరింపోయిందని తమకు వీరిపై ప్రజలనుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎవరెవరు ఎక్కడ ఎం పనిచేస్తున్నారో తమకు తెలపాలని కౌన్సిలర్‌లు డిమాండ్‌ చేశారు. వెంటనే కమీషనర్‌ భవాని ప్రసాద్‌ కలుగజేసుకుని టౌన్‌ప్లానింగ్‌లో పనిచేస్తున్న సిబ్బంది,ఐడెంటిటీకార్డుతో, ప్రతి రోజు వర్క్‌డైరీ మెయిన్‌టెయిన్‌ చేయాలని ఆదేశించారు.

తాజా వీడియోలు

Back to Top