తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి

రామాపురం : వేసవికాలంలో భూగర్భజలాలు అడుగంటడంతో నీటిబోర్లు సక్రమంగా పనిచేయక గ్రామాలలో తీవ్రంగా నీటి సమస్య ఏర్పడిందని వైయ‌స్‌ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి సూరం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గత ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులు సాగు చేసిన ప్రధాన పంటలైన వేరుశనగ, వరి, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు తీవ్ర వర్భాభావం దృష్టా పెట్టిన ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం పశుగ్రాసం, చెత్తకూడా దక్కకపోడంతో ఈ పరిస్థితులలో పశుపోషణ కూడా నేడు భారమై క‌బేళాల‌కు త‌ర‌లించాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో రైతులు, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. ముఖ్యంగా రాయలసీమలో గత దశాబ్ధకాలంగా వర్షాలు లేని కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ముదురుమామిడి తోటలు వేలాది ఎకరాలలో నిట్టనిలువుగా ఎండిపోతున్నాయన్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులు, కరువు బృందాలు పర్యటించినా మామిడి రైతులకు ఇంతవరకు చిల్లగవ్వకూడా మంజూరు చేయలేదన్నారు. అలాగే పంటనష్టం(ఇన్‌ఫుట్‌సబ్సిడీ), పంట బీమా కూడా రైతులకు ఇచ్చిన రుణమాఫీలానే ఉందని ఆయన విమర్శించారు. వెంటనే కరువు రైతుల వలసలు వెళ్లకుండా ఆదుకోవాలన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేపట్టాలని డిమాండ్ చేశారు.

Back to Top