అధైర్యపడొద్దు..అండగా ఉంటా

  • పోర్టు నిర్మించాలంటే రెండు వేల ఎకరాలు చాలు
  • రైతులు 5 వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు
  • బాబుకు దుర్బుద్ది.. లక్ష 5 వేల ఎకరాలు కావాలంటున్నారు
  • టీడీపీ ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుంది
  • వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మీ భూములు తిరిగి ఇస్తాం
  • కోన గ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
మచిలీపట్నం: బందర్‌ పోర్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కున్నా..వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు భూములు విషయంలో అధైర్యపడొద్దని, అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. బందర్‌ పోర్టు బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించిన వైయస్‌ జగన్‌ కోన గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బందర్‌ పోర్టు నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పోర్టు నిర్మాణానికి రెండు వేల ఎకరాల భూమి అవసరం కాగా, రైతులు 5 వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ జగన్‌ చెప్పారు. అయితే చంద్రబాబుకు దుర్భుద్ది పుట్టిందని, ఏకంగా లక్షా 5 వేల ఎకరాలు ల్యాండ్‌ ఫూలింగ్‌ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మనకు ఇష్టం లేకపోయిన, మన అంగీకారం లేకపోయిన బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే..ఈ గ్రామాల్లో తన్నెంత తిరుగుబాటు వచ్చిందన్నారు. అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు.

ఏ తండ్రీ అలా చేయడు..!
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడని,  తండ్రి అనే వాడు పిల్లలకు నష్టం జరిగేలా వ్యవహరించడని వైయస్‌ జగన్‌ అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు మన వద్ద ఉన్నది లాక్కొని మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు ఓట్ల కోసం వచ్చినప్పడు పోర్టుకు 4800 ఎందుకు 1200 ఎకరాలు సరిపోతుందని అన్నట్లు గుర్తు చేశారు. సీఎం అయ్యాక ఏ రకంగా తాను మన జీవితాలతో  చెలగాటం అడుతున్నారో..ఏ స్థాయిలో అవినీతిని తీసుకొచ్చారో అర్థ మవుతోందని వివరించారు. బాబుకు ఏమైనా బుర్ర ఉందా అని వైయస్‌ జగన్‌ ఫైర్ అయ్యారు. పోర్టు కట్టిన తరువాత రైతులు అత్యాశతో ఎకరం కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తారని బాబు పేర్కొనడం దుర్మార్గమన్నారు. పరిశ్రమలు పెట్టే వారు కోటి రూపాయలు పెట్టి భూములు కొంటే రైతుల ముఖాల్లో ఆనందం చూడటం మీకు ఇష్టం లేదా బాబు అని నిలదీశారు. ఆ కోటి రైతులకు ఎందుకు..నాకింత..మీకింత అనే దిక్కుమాలిన ఆలోచన బాబు చేస్తున్నారని మండిపడ్డారు.  ల్యాండ్‌ ఫూలింగ్‌ ద్వారా మన భూమి ఇష్టం లేకపోయిన లాక్కుని, మనకు బిక్షం వేసినట్లు వెయ్యి గజాలు ఇవ్వడం దారుణమన్నారు. ప్రతి ఎకరాలో రొయ్యలు, చేపల చెరువులతో కళకళలాడుతుంటే బాబు వీటిని లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. పేదవాడికి ఇచ్చిన అసైన్డ్‌ భూములను చంద్రబాబు తన అత్తగారి సొత్తు అన్నట్లు ఇష్టారాజ్యంగా తీసుకొని ఆయనకు కావాల్సిన బడా పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. మనమంతా ఐక్యంగా ఉందామన్నారు. మన భూములు లాక్కొవడానికి బాబు వాళ్ల నాన్న తరం కూడా కాదన్నారు. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం వస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు.
 ––––––––––––––––––
నాగ గౌరి
మాకు ఎవరు లేరని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. జగనన్న మనుషులంటే ఏమనుకుంటున్నారో..మాకు జగనన్న అండగా ఉన్నాడు. ఎవరికి భయపడం. మా భూములు ఇచ్చేది లేదు. మాకు మూడెకరాల అసైన్డ్‌ భూమి ఉంది. పొలం మొత్తం లాక్కుంటామని అధికారులు బెదిరిస్తున్నారు. మా ఊరికి చంద్రబాబు పంచె కట్టుకొని వచ్చి ఉంటే మూతిపళ్లు రాలేవి. పంచె ఊడేలా కొట్టేవాళ్లం. జగనన్న మనుషులంటే ఏంటో చూపించేవాళ్లం.

వైయస్‌ జగన్‌: మన ప్రభుత్వం వచ్చిన తరువాత టీడీపీ సర్కార్‌ తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తాం. బాబు నాన్న వచ్చినా ఏం చేయలేడు. రైతులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది.
––––––––––––
నాగలక్ష్మి, ఎంపీటీసీ
టీడీపీ నాయకులు అడ్డంగా దోచుకుంటున్నారు. మా ఊర్లో కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి పశువుల ఆసుపత్రి కట్టారట. రూ.5 లక్షలతో నిర్మించే ఆసుపత్రికి కోటిన్నర కాజేశారు. మాకు రెండెకరాల భూమి ఉంది. అందులో రొయ్యలు, చేపలు సాగుచేసి బతుకుతున్నాం. బిడ్డకు కట్నం ఇస్తామంటే అల్లుడు తీసుకోవడం లేదు. లోన్లు పుట్టడం లేదు. క్యాష్‌ కావాలంటా. మా నాన్న ఇచ్చిన భూమికే రిజిస్ట్రేషన్‌ లేదు.  ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.

వైయస్‌ జగన్‌: అసైన్డ్‌ భూములపై బాబుకు  కన్నుబడింది. పేదవాడికి ఎందుకు డబ్బులు రావాలి. పారిశ్రామిక వేత్తలు, తాను పంచుకుంటే సరిపోతుందని బాబు ప్లాన్‌. ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా అడ్డుకుందాం. టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
–––––––––
దుర్గయ్య, ఎంపీటీసీ
బాబు సీఎం అయ్యాక చినుకు జాడ లేదు. పోర్టు నిర్మాణం పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారు. ఈ ఆడబిడ్డల కన్నీళ్లలో బాబు కొట్టుకుపోతాడు. మా ఉసురు తగులుతుంది. పిల్లలను చదివిద్దామంటే డబ్బులు లేవు. రుణమాఫీ లేదు. ఆడవాళ్లకు మూడు వేలు ముక్కుపుడకకు సరిపోవడం లేదు. నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లకు కట్నంగా ఇచ్చిన భూములు అల్లుడు వెనక్కి ఇచ్చారు. భూమి అమ్ముదామంటే ఎవరూ కొనడం లేదు.

వైయస్‌ జగన్‌: చంద్రబాబు ఎన్ని పుష్కరాల్లో మునిగిన పాపాలు పోవు. ప్రజల ఉసురు తగులకపోదు.
–––––––––––––
 నాగులు
మా ఊరికి మంచినీళ్లు లేవు, వ్యవసాయం లేదు. చేపలు, రొయ్యలు వేసుకొని బతుకుతున్నాం. మా భూములు అన్నీ కూడా అసైన్డ్‌ భూములు. అవన్నీ మావే అని ప్రభుత్వం లాక్కుంటుంది. ఎలా బతకాలి.

వైయస్‌ జగన్‌: ఒక పోర్టు కట్టడానికి మాములుగా 2, 3 వేల ఎకరాలు సరిపోతుంది. అటువంటింది 5 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. బందర్‌ పోర్టు లక్ష్యాన్ని చేరుకోవడానికి 50 ఏళ్లు పడుతుంది.  పోర్టు బాధితులకు  వైయస్‌ఆర్‌సీపీ తోడుగా ఉంటుంది. అన్ని రకాలుగా అండగా నిలుస్తాం.
––––––––––––––––
వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృష్ణా జిల్లాలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను, పెర్నీ నాని తదితరులు అపూర్వ స్వాగతం పలికారు. బందర్‌ పోర్టు పరిసర గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ వస్తున్నారన్న సమాచారంతో రోడ్లపైకి జనం వచ్చి ఎదురుచూశారు. జననేత రాగానే ఆయన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. దారివెంట తనకోసం వేచి ఉన్న ప్రజలకు వైయస్‌ జగన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
 
Back to Top