రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు

హైదరాబాద్:

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, ఉద్రిక్తతలు పెంచేలా నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదని ఆయన సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతూ ఒక పక్క అన్నదమ్ముల్లా విడిపోదామని అంటున్న కేసీఆర్ మరోపక్క రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని తెలిపారు.

ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య సుహృద్భావ వాతావరణంలో విభజన ప్రక్రియ జరగాలని, లేకపోతే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని శ్రీ జగన్ అన్నారు. ఉద్యోగులకు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పూర్తిస్థా‌యిలో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల న్యాయపరమైన హక్కులకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన ఉద్యోగుల సమస్యను సీమాంధ్ర రాష్ట్రానికి సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడు అర్థం చేసుకొని వారికి పూర్తిగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తమ జీతాలు, జీవితాల గురించి భయాందోళనలో ఉన్న ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్ పై‌న కూడా ఉందన్నారు.

రాజ్యాంగం ప్రకారం జరిగే విభజన ప్రక్రియకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం, ఉమ్మడి రాజధానిలో పనిచేయాల్సిన ఉద్యోగుల మధ్య వాతావరణాన్ని కలుషితం చేయడం తీవ్రమైన అంశాలని శ్రీ జగన్ ‌అభివర్ణించారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నామని, అయినప్పటికీ ఈ అంశాలపై దృష్టి పెట్టకుండా అడ్డగోలుగా విభజన చేశారని ఆయన తప్పుపట్టారు. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే వైఖరిని ఉపేక్షించడం తగదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకలనలను వెంటనే ఆపాలని ఆయన కోరారు.

Back to Top