ఆరోపణలు చేస్తే నాలుకలు కోస్తాం

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మేరుగు హెచ్చరిక
  • దళితులకు పెద్దపీట వేసేది వైయస్‌ కుటుంబమే
  • పిరికిపందలు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్‌
  • ఎస్సీ, ఎస్టీ చట్టాలను చుట్టాలుగా మల్చుకున్న బాబు
  • దళిత, గిరిజనులపై ప్రభుత్వం దాడులు
  • బాబు ఏమిస్తాడని టీడీపీలో చేరావు కల్పన
  • సబ్‌ప్లాన్‌ నిధులపై బాబును నిలదీస్తే మీరు మగాళ్లు
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున 

గుంటూరు: చంద్రబాబు అవినీతి డబ్బులకు ఆశపడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తే నాలుకలు కోస్తామని హెచ్చరించారు.  వైయస్‌ఆర్‌సీపీలో దళితులకు గౌరవం లేదంటూ కొంతమంది నీచ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ నుంచి టీడీపీలోకి పారిపోయిన పిరికిపందలు దమ్ముంటే చర్చకు రావాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై మేరుగు విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో చంద్రబాబు నీచ రాజకీయాలను ఎండగట్టారు.

ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అని మాట్లాడిన  పార్టీలోకి డబ్బులకు అమ్ముడు పోయిన మీరా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు దళిత, గిరిజన ప్రజల వ్యతిరేక ప్రభుత్వం నడుపుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు వందల కొద్ది హామీలను ప్రజలకు కుమ్మరించి అధికారంలోకి వచ్చిన బాబు గద్దెనెక్కిన తరువాత ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తూట్లు పొడుస్తూ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బాబు
రాజ్యాంగ ప్రధాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు అపహాస్యం చేస్తున్నారని మేరుగు నాగార్జున ఆరోపించారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి బాబు తన సొంత రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను తన చుట్టాలుగా మల్చుకుంటున్నాడని విమర్శించారు. అధికారం చేపట్టి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దళిత, గిరిజనులకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమానైనా అమలు చేశారా అని బాబును నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దళిత ప్రజల అభివృద్ధికి కేటాయించకుండా దళితుల నిధులు వేరే దారి మళ్లించడానికి జీవో తీసుకొచ్చిన నీచ సంస్కృతి చంద్రబాబుదని ధ్వజమెత్తారు. గిరిజన కౌన్సిల్‌కు సంబంధించి వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని కమిటీ కూడా ఏర్పాటు చేయలేదని ఫైరయ్యారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ మాదిరిగా దళితులకు గృహ నిర్మాణాలు చేపట్టారా..?.. లేక గిరిజనులకు సెంటు భూమి అయినా పంచారా అని బాబును నిలదీశారు. రాజధాని ప్రాంతంలో పేద రైతుల నుంచి భూములు లాక్కొని చంద్రబాబు తన తాబేదారులకు అప్పగించి నిలువనీడ లేకుండా చేశాడని మండిపడ్డారు. 

మార్కులు కొట్టేయడానికి మాట్లాడొద్దు
చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యుల నోర్లు ఏమయ్యాయని మేరుగు ప్రశ్నించారు. ఎంతోమంది దళిత, గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అల్లాడుతుంటే ఉద్యోగాలపై చంద్రబాబును ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. అసలు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలకు దళితులపై గౌరవం ఉందా అని నిలదీశారు. దళిత ఓట్లతో గెలిచి చంద్రబాబు నాయుడు ఏమిస్తాడని టీడీపీలోకి వెళ్లిపోయావని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను మేరుగు నిలదీశారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి వైయస్‌ఆర్‌ సీపీపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మీకు చేతనైతే సబ్‌ప్లాన్‌ నిధుల గురించి ఫైట్‌ చేయాలని, దళిత గిరిజనుల  అభివృద్ధి కోసం మీరు చంద్రబాబును నిలదీస్తే మగాళ్లవుతారని సూచించారు. దివంగత వైయస్‌ఆర్‌ ఏ విధంగా దళిత, గిరిజన ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారో అదేరీతిలో వైయస్‌ జగన్‌ కూడా దళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్షనేతగా వైయస్‌ జగన్‌ మాట్లాడితే అభూత కల్పనగా చిత్రీకిస్తున్నారని మండిపడ్డారు. దళిత ప్రజలను, చట్టాలను కించపరుస్తున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గౌరవం దక్కుతుందని ఎద్దేవా చేశారు. 
 
Back to Top