దొంగ సంతకాల చరిత్ర చంద్రబాబుదే: మేకపాటి

హైదరాబాద్, 4 ఫిబ్రవరి 2013: దొంగ సంతకాలు పెట్టించిన చరిత్ర టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడిదే అని వైయస్‌ఆర్‌సిపి ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. 'జగన్ కోసం.. జనం సంతకం'లో కోటి సంతకాల సేకరణపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కాగితాలు, బోగస్ సంఖ్యలను సృష్టించడం చంద్రబాబు నాయు‌డికి, ఆయన కంపెనీకి వెన్నతో పెట్టిన విద్య అని, అందుకే ఆయనకు అన్నీ బోగస్‌లాగే కనిపిస్తున్నాయని రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ‘జగన్ కోసం.. జనం సంతకం’లో పాలుపంచుకున్న రెండు కోట్ల మందిని చంద్రబాబు అవమానించేలా మాట్లాడటం హేయం అని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచేందుకు వైస్రాయ్ హోట‌ల్‌లో ఎమ్మెల్యేలతో దొంగ సంతకాలు పెట్టించింది చంద్రబాబే అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోట‌ల్ వేదికగా నిర్వహించిన ఎమ్మెల్యేల ‌శిబిరానికి సంబంధించి బోగస్ ‌లెక్కలు సృష్టించింది చంద్రబాబు, ఆయన కంపెనీయే అని మేకపాటి ఆరోపించారు. అందుకే తన మనసులో ఉన్న దురాలోచనలను బట్టి చంద్రబాబు ఈ రోజు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన దొంగ పనులను ఇతరులకు ఆపాదించడం సమంజసం కాదన్నారు.

‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమం 20 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంత ఉధృతంగా జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు‌ ఉత్సాహంగా చేసిన సంతకాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు రక్తంతో కూడా సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇవన్నీ రాష్ట్రంలోని అన్ని మీడియాలూ చూసినప్పటికీ చంద్రబాబు బినామీ మీడియా సంస్థలు మాత్రం ప్రజలను కించపరుస్తున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఒక ఛానల్ కట్టుకథలు చెబుతోందని మేకపాటి‌ రాజమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌కు ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రతిసారీ రుజువు అవుతున్నా చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ రోజురోజుకూ మరింతగా పలచనైపోతున్నారని మేకపాటి విమర్శించారు.

చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేనేలేరని అన్నారు. మైనార్టీలో పడిన ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
Back to Top