రాజధాని ప్రాంతంలో రక్షణ క‌రువు

 

 జీజీహెచ్‌లో ఒప్పిచర్ల బాధితురాలికి వైయ‌స్ఆర్‌సీపీ నేతల పరామర్శ 
 గుంటూరు : రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ కరువైందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిప‌డ్డారు.  గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు పార్టీ మహిళా విభాగం నేతలతో కలిసి ఆమె పరామర్శించారు. గైనకాలజీ వార్డులోని వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి సూపరింటెండెంట్‌ రాజునాయడును కలిసి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. తర్వాత జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌ ఎదుట, ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లాలో వరుస అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఈ సంఘటన విన్న వెంటనే చలించిపోయిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత మహిళలకు ధైర్యం చెప్పి అండగా నిలవాలని తమను పంపించారని చెప్పారు. నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పిల్లలు, మహిళలపై 15 అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. దారుణ అత్యాచార ఘటన వెలుగు చూసి 24 గంటలు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం బాధితురాలికి న్యాయం చేస్తుందనే నమ్మకం కలగడం లేదన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అధికార పార్టీ సానుభూతిపరుడు కాబట్టే ఇంకా అతన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నాయకులు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.   వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున బాధితురాలికి ధైర్యాన్ని కల్పించడంతోపాటు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.  Back to Top