మా సహనాన్ని పరీక్షించవద్దు

  • ఓ పార్టీకి చెందిన వారికే ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారు
  • వ్యాపారం చేయటానికి వచ్చారా...రాజకీయాలు చేయటానికి వచ్చారా...
  • వివక్షను చూపితే కార్మికులే తిరగబడతారు...
  • జెపి యజమాన్యం తీరుపట్ల మండిపడ్డా జంగా
  • బాధిత రైతు కుటుంబాల్లో ఉద్యోగాలకు ఇవ్వకపోవటంపై ఆగ్రహం
గామాలపాడు(దాచేపల్లి): పరిశ్రమలకు భూములు అమ్ముకుంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశపడ్డారు...భూములు అమ్ముకున్న రైతు కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు సూచించిన వారికే ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు..మీరు వ్యాపారం చేయటానికి వచ్చారా..రాజకీయాలు చేయటానికి వచ్చారా..మా సహనాన్ని పరిక్షించవద్దని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. మండలంలోని గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జెపి సిమెంట్‌ పరిశ్రమకు రైతులతో కలిసి జంగా శుక్రవారం వెళ్లారు. పరిశ్రమ కోసం భూములు అతి తక్కువ ధరకే అమ్ముకున్నామని, తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వివక్షను చూపిస్తున్నారని బాధిత రైతులు జంగా దృష్టికి తీసుకువచ్చారు.  తక్షణమే స్పందించిన క్రిష్ణమూర్తి యజమాన్య ప్రతినిధులు రెసిడెన్సీ మేనేజర్‌ మోహన్, అసిస్టెంట్‌ మేనేజర్‌ విజయ్‌చంద్రలతో మాట్లాడారు. శ్రీనగర్, రామాపురం, గామాలపాడు గ్రామాల్లో టీడీపీకి చెందిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇంటర్వ్యూలు చేశారని తమ దృష్టికి వచ్చిందని, ఏ ప్రతిపాదికన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పాలని జంగా డిమాండ్‌ చేశారు. సెంటు భూమి కూడా పరిశ్రమకు అమ్మని వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తే అమ్మిన రైతుల పిల్లలను ఎందుకు ఇంటర్వ్యూలకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు సిఫారస్‌ చేస్తే ఎవరికైయిన ఉద్యోగాలు ఇస్తారా..మాది ప్రతిపక్షపార్టీ ఆ పార్టీ వారికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో..మా పార్టీ వారికి కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. మీ ఇష్టానుసారంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తే చూస్తు ఊరుకోమని, భూముల అమ్ముకున్న రైతుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని జంగా తేల్చిచెప్పారు. 

యజమాన్యం ఏకపక్షంగా వ్యవహరించటం వల్ల ఏళ్ల తరబడి పరిశ్రమలో పనిచేస్తున్న 100మందికిపైగా కార్మికులను అన్యాయంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించారని, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు చట్టప్రకారం వేతనాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని జంగా అన్నారు. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే వ్యాపారం వదిలిపెట్టండి...వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయాలకు దూరంగా పరిశ్రమను నడపడి అని ప్రతినిధులకు జంగా సూచించారు. బాధిత రైతులకు న్యాయం చేయకుండా టీడీపీ నేతలు చెప్పినట్లు చేస్తే తమదైయిన శైలిలో స్పందిస్తామని, ఈ విధంగానే వ్యవహరిస్తే కార్మికులే తిరబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జంగా హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా బాధిత రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రామాల వారీగా బాధిత రైతులతో పరిశ్రమ ఎండీతో మాట్లాడించాలని జంగా డిమాండ్‌ చేశారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను యజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని మోహన్, విజయ్‌చంద్రలు చెప్పారు. జంగా వెంట వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, సర్పంచ్‌ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆకూరి వీరారెడ్డి, మాజీ సర్పంచ్‌ కుంపటి చింతయ్య, నాయకులు కూసం నాగిరెడ్డి, ఆకూరి కాశీరెడ్డి, వణుకూరి శంకర్‌రెడ్డి, కసిరెడ్డి వీరారెడ్డి, ఆకూరి కృష్ణారెడ్డి, ఈర్ల రామకోటయ్య, కుంపటి యాకోబు, వేముల శ్రీహరి, పేరుపొగు ఏసోబు తదితరులున్నారు.
Back to Top