ఫార్మా ఫ్యాక్టరీని ఒప్పుకునే ప్రసక్తే లేదు

  • దిండి ప్రాంతంలో ప్రజల ఆమోదం లేకుండా ఫార్మా ఫ్యాక్టరీకి చర్యలు
  • ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఆక్వా రంగం కుదేలు
  • ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమిస్తాం
  • వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత మోపిదేవి వెంకట రమణ
గుంటూరు: ప్రజల ఆమోదం లేకుండా ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ హెచ్చరించారు. నిజాంపట్నం, దిండి పరిసర ప్రాంతాల్లో  ప్రభుత్వం ఫార్మా ఫ్యాక్టరీకి చేపట్టిన చర్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మత్య్సకారులకు నష్టం కలిగించే ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పే. రేపల్లి నియోజకవర్గం దిండి పంచాయతీలో ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. నాడు కాంగ్రెస్‌ హయాంలో ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తే..అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న నేను అది పూర్తిగా తీర ప్రాంతం కావడంతో ఈ ఫార్మా అన్నది బద్ధ శత్రువు అని వ్యతిరేకించాను. ఈ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ఏదైన ఆక్వా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామన్నాం. ప్రజలకు మేలు చేసే వ్యాన్‌ఫిక్‌ను నాడు స్వాగతించాం.  2006వ సంవత్సరంలో ఫార్మా పరిశ్రమ పెడతామని నా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్లే ఇవాళ దిండి ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, భూములు స్వాధీనం చేసుకొని పరిశ్రమలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఆ పరిశ్రమ తీరు తెన్నులు ఏంటీ, వాటి వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఏవిధంగా లాభ నష్టాలు జరుగుతాయో ఆలోచించాలి. అయితే అక్కడ ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. మేం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసేది ఒక్కటే. ఫార్మా అనే పేరుతో ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా మేం వ్యతిరేకిస్తాం. ఆక్వాకు అనుసంధానమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. నిజాంపట్నం దిండి పరిసర ప్రాంతాల్లో మీరు ఎలాంటి పరిశ్రమలు పెడుతున్నారో ముందుగానే ప్రజలకు చెప్పాలి. ప్రజలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే పోరాటం చేస్తాం. ఇప్పటి వరకు తీసుకున్న  అన్ని నిర్ణయాలు కూడా ప్రజలకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. దిండి ఫార్మా కెమికల్‌ పేరుతో జరుగుతున్న విషయాలను బహిర్గతం చేయాలి. ఈ ఆలోచనకు పుల్‌స్టాప్‌ పెట్టాలి. మత్స్యకారులకు ఉపయోగపడే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.

వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది:  మ్రరి రాజశేఖర్‌
మోపిదేవి వెంకటరమణ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. ఆయనకు పార్టీ తరఫున అండగా ఉంటాం. ఫార్మా ఇండస్ట్రీ వస్తే భూగర్భ జలాలు కలుషితమవుతాయి. ఆక్వా కల్చర్‌ సర్వనాశనం అవుతుంది. దీనిపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మోపిదేవి పోరాటం చేస్తున్నారు. ఎక్కడో ఎడారి ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. జనాల మధ్యలో ఇలాంటి పరిశ్రమలు పెట్టి వాతావరణాన్ని కలుషితం చేయొద్దు.

ప్రజా వ్యతిరేక ఆలోచనలు విరమించుకోవాలి:  లేళ్ల అప్పిరెడ్డి
టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. దిండి ప్రాంతంలో అమాయక ప్రజలు బతుకుతున్నారు. వీరంతా అక్వాపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం దురాలోచనతో ఫార్మా కంపెనీ పెట్టేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికైనా కూడా ప్రజా వ్యతిరేక ఆలోచనను విరమించుకోవాలి. లేదంటే ప్రజల పక్షాన వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉంది.
Back to Top