హైదరాబాద్) విజయవాడలో చంద్రబాబు చేయించిన దీక్ష నవనిర్మాణ దీక్ష కాదని, విధ్వంసక దీక్ష మాత్రమే అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదని ఆమె మండిపడ్డారు. విభజన సమయంలో జరిగిన గాయాన్ని మళ్లీ రేపేందుకు ప్రయత్నం చేస్తున్నారని పద్మ అభివర్ణించారు. ఆనాడు జరిగిన దగాని గుర్తు చేసి ఎమోషన్ లు రెచ్చగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. . రెండేళ్లలో ఏమీ చేయడం చేతగాని ముఖ్యమంత్రికి ప్రజలను రెచ్చగొట్టడం మాత్రం బాగా చేతనవుతోందని పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని చెబుతూ...ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఏపీ అంటూ జీవో విడుదల చేశారని ఆమె గుర్తు చేశారు. వాస్తవానికి భారతీయ పౌరులు ఉంటారుతప్పితే ఆంధ్రప్రదేశ్ పౌరులు అంటూ ప్రత్యేకంగా ఉండరని ఆమె చెప్పారు. అంటే భారతీయ పౌరులుగా మనం జీవిస్తున్నామని, కానీ చంద్రబాబుకి మాత్రం అది ఇష్టం లేనట్లుగా ఉందని వాసిరెడ్డి పద్మ సందేహం వ్యక్తం చేశారు. ఇటువంటి జీవో ఇచ్చినందుకు గాను రాజద్రోహం కేసు బుక్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చేస్తున్న అన్యాయాలు, పాపాలు కప్పిపుచ్చుకొనేందుకు ఇటువంటి దీక్షలు చేయిస్తున్నారని పద్మ అభివర్ణించారు.