ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయండి

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో చేరిన తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుకు వెంటనే నోటీసులిచ్చి, అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై చర్య తీసుకోవడంలో జాప్యం చేయొద్దని కోరింది. తమ పిటిషన్‌లో చేసిన ప్రధాన అభ్యర్థనకు అనుగుణంగా వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు, మధ్యంతర ఉత్తర్వుల కోసం కోరిన విధంగా ఈ ముగ్గురు సభ్యులు శాసనసభ సమావేశాల్లో పాల్గొనకుండా వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.

అసెంబ్లీలోని కార్యాలయంలో స్పీకర్‌ను కలుసుకుని ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ పార్టీ ప్రతినిధి బృందం స్పీకర్ ఫార్మాట్‌లో పిటిషన్లను సమర్పించింది. ఈ పిటిషన్లతో పాటు పార్టీ ఫిరాయింపులకు సాక్ష్యాలుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియో సాక్ష్యాలు, సీడీలు, ఇతర ఆధారాలను అందజేసింది. ప్రతినిధి బృందంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మహ్మద్ మతీన్ ముజాద్దాదీ, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, బండారు వెంకటరమణ, ఫజల్ అహ్మద్ ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top