ఓట్ల తొలగింపు దారుణం

గుంటూరు(పట్నంబజారు)) కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడితే న్యాయపోరాటానికి ఏ మాత్రం వెనుకాడబోమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ...అధికారులు సైతం బలిపశువులు కావద్దని హెచ్చరించారు. అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అడుగడుగున పారదర్శకతను పాతర వేస్తూ.. నిబంధనలకు నీళ్ళోదులుతూ అధికార పార్టీనేతలకు తలొగ్గి అడ్డుగోలుగా ఓట్లు తొలగించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్‌ పరిధిలో లక్షకు పైబడి ఓట్లు తొలగించారని... ఏ ప్రాతిపదికన, ఏఏ వార్డుల్లో ఎన్ని ఓట్లు తొలగించారో స్పష్టత ఇవ్వాలని  ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అవుతున్నా నగరంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజలు వైయస్సార్‌ సీపీకి అనూకూలంగా ఉన్నారన్న ఉద్దేశ్యంతోనే తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓట్లను అక్రమంగా తొలగించారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 5న పార్టీ నగర ముఖ్యనేతల విస్త్రృతస్ధాయి సమావేశం జరుగుతుందని, ప్రభుత్వం, అధికారుల తీరుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్‌పురం రాము), బందా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top