'డిసిసిబి ఎన్నిక నిర్వహించకపోతే ఆత్మాహుతి'

కడప, 20 ఫిబ్రవరి 2013: నోటిఫికేషన్‌ ప్రకారం కడప డిసిసిబి ఎన్నిక తక్షణమే జరిపించకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఆత్మాహుతికైనా వెనుకాడబోనని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వైయస్‌ వివేకానందరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికల అధికారి లేరన్న సాకు చూపించి డిసిసిబి ఎన్నికను వాయిదా వేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని వివేకానందరెడ్డి ఆరోపించారు. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నిక నిర్వహించాలని ఆయన బుధవార‌ం ఇక్కడ డిమాండ్ చేశారు.‌ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా డిసిసిబి ఎన్నికల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని వివేకానందరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఎన్నికల అధికారిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కిడ్నాప్‌ చేయించి, అధికారి లేరనే మిషతో ఎన్నికను వాయిదా వేయాలని ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం అని వివేకానందరెడ్డి విమర్శించారు. నోటిఫికేషన్‌కు కనీస విలువ ఇవ్వాలంటే ఈ ఎన్నికలను తప్పనిసరిగా ఈ రోజే జరిపించాలన్నారు. డిసిసిబి ఎన్నిక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తామంతా నిరాహార దీక్ష చేస్తున్నామని వివేకానందరెడ్డి స్పష్ట చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి తాము బతుకు చాలించడానికి కూడా సిద్ధం అని హెచ్చరించారు.
Back to Top