ఫించన్ల మంజూరులో వివక్ష

కౌన్సిల్‌లో అధికార పక్షాన్ని  నిలదీసిన ప్రతిపక్షం 
 గుంటూరు: ఫించన్ల మంజూరు, పంపిణీలో వివక్ష జరిగిందని, ఇలాంటివి ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్దమంటూ నరసరావుపేట కౌన్సిల్‌హాలులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అధికారపక్షంపై ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని తమ వార్డుల్లో అధికారపార్టీ నాయకులు లబ్దిదారులను ఎంపికచేయటం, ఫించన్‌ సొమ్ము పంపిణీ చేయటం ఏమిటని మున్సిపల్‌ ప్లోర్, డిప్యూటి ప్లోర్‌లీడర్లు పాలపర్తి వెంకటేశ్వరరావు, షేక్‌.మున్నీలు అధికార పక్షాన్ని నిలదీశారు. దీనిపై టీడీపీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్‌ పోకా శ్రీనివాసరావు కలుగుచేసుకొని ప్రజలు ఎన్నుకుంటే కౌన్సిలర్లకు కొమ్ములొచ్చాయా..ప్రతి దానికి అధికార పార్టీ అంటారూ అంటూ వ్యాఖానించటంతో ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. వైస్‌ చైర్మన్‌ షేక్‌.మీరావలి కలుగచేసుకొని సభ్యులను శాంతింపచేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో పలు వార్డుల్లో చేపట్టబోయే అభివృద్ది పనులకు చెందిన టెండర్ల ఆమోదం కోసం శనివారం కౌన్సిల్‌హాలులో నిర్వహించిన అత్యవసర సమావేశానికి చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తా అధ్యక్షత వహించారు.

కనీసం జాబితాలు కూడా ఇవ్వరా..?
 డిప్యూటి ప్లోర్‌ లీడర్‌ షేక్‌.మున్నీ ఫించన్ల లబ్దిదారుల ఎంపిక, సొమ్ము పంపిణీ వ్యవహారాలను ప్రస్తావించారు. తన వార్డులో తాను చూపించిన వ్యక్తులకు కేవలం ఇద్దరికే మంజూరయ్యాయని, మిగతావి మొత్తం టీడీపీ నాయకులు చూపించిన వారికే మంజూరుచేశారని, కనీసం జాబితా కూడా ఇవ్వలేదని...ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. వార్డు ప్రజలు ఎన్నుకున్నది మమ్మల్నా..వారినా..? అంటూ ప్రశ్నించారు. ప్లోర్‌లీడర్‌ పాలపర్తి కలుగచేసుకొని మాట్లాడుతూ ముందుగా మంజూరైన జాబితాను కౌన్సిలర్లకు ఇవ్వలేదని, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఫించన్‌ సొమ్ము అందజేసే కార్యక్రమానికి కేవలం 2గంటల ముందు మాత్రమే జాబితా అందించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరుసటిరోజు మున్సిపల్‌ ఉద్యోగి తన వార్డులో టీడీపీ నాయకుడిని దగ్గరపెట్టుకొని ఫించన్ల సొమ్ము అందజేశారని, ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కమిషనర్‌ అన్నాప్రగడ భానూప్రతాప్‌ స్పంధిస్తూ నూతన లబ్దిదారుల జాబితా తామెవరికీ ఇవ్వలేదని, ఎవరైనా బయటి నుంచి తెచ్చుకుంటే తమకు సంబందంలేదన్నారు. అలాగే ఫించన్ల సొమ్ము పంపిణీ సమయంలో తమ ఉద్యోగి విధి నిర్వాహణలో ఉండగా పక్కన ఎవరున్నా తమకు సంబంధంలేదన్నారు. నూతన ఫించన్ల మంజూరులో తమ వార్డు ప్రజలకు అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కారుమంచి మీరావలి, సయ్యద్‌మహబ్బి, గేరాకుమారి కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు.
ఇప్పటికైనా పనులు చేపడతారా..?

వైయస్‌ఆర్‌సీపీ 6వ వార్డు కౌన్సిలర్‌ లామ్‌ సోమయ్య మాట్లాడుతూ 2014లో ఎన్నికై రెండవ కౌన్సిల్‌ సమావేశంలో రూ.2.14లక్షల ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో సైడుకాలువ నిర్మాణం చేస్తామని చెప్పారని, మూడేళ్ళు గడుస్తుందని ఇప్పిటికైనా పనులు మొదలు పెడతారా అంటూ ప్రశ్నించారు. మీరు ప్రతిపాదించిన ప్రదేశంలో కాలువపై ఆక్రమణలను తొలగించి పనులు మొదలు పెడతామంటూ కమిషనర్‌ సమాధానమిచ్చారు. 7వ వార్డు కౌన్సిలర్‌ గేరా కుమారి మాట్లాడుతూ సబ్‌ ప్లాన్‌ నిధులతో తన వార్డులో పనులేమి చేపట్టలేదని అన్నారు. ు. మాగులూరి రమణారెడ్డి మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టే పనుల్లో వివక్షత పాటిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు రూ.2లక్షలు దాటలేదని, టీడీపీకి చెందిన 5వ వార్డులో రూ.55లక్షల పనులు చేపట్టడమేమిటంటూ ప్రశ్నించారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ మీ వార్డుల్లో ఉన్న పనుల ఆవశ్యకతను తనకు చూపిస్తే రూ.5లక్షలలోపు పనులను వెంటనే నామినేషన్‌ పద్దతిపై చేయిస్తామని హామీ ఇచ్చారు. గృహాలకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు తీస్తున్న గోతుల వలన కుళాయిపైపులు దెబ్బతింటున్నా పట్టించుకోవట్లేదని 33వ వార్డు కౌన్సిలర్‌ కొలిపాక చంద్రశేఖర్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. 
Back to Top