ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష

చిత్తూరుః  ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని, నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పానన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో అవకతవకలు, శానిటేషన్‌పై కాగ్ నివేదిక బహిర్గతం చేసిన అంశాలను నివేదించానన్నారు. వైద్య, ఆరోగ్య, తాగునీటి సమస్యలపై చర్చించానని తెలిపారు. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలన్న అంశంపై, ప్రభుత్వ మహిళ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఆదనపు భవనాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాన్నారు.

హంద్రీ-నీవా, కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి సమ్మర్‌స్టోరేజ్ పనులను కూడా వేగవంతం చేయాలని మాట్లాడినట్టు తెలిపారు. విరామ సమయంలో పూర్తి నివేదికలతో మంత్రుల వద్దకు వెళ్లి వ్యవసాయ మార్కెట్, మోడలైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్, 200 పడకల ఆసుపత్రిగా మార్చాలనే అంశాలపై చర్చించానన్నారు.

ముఖ్యంగా మదనపల్లె మున్సిపాలిటీలో జనాభా ప్రాతిపదికన తాగునీరు సరఫరా చేయడంలో అధికారుల విఫలమైన విషయాన్ని కాగ్ బహిర్గతం చేసిందన్నారు. అండర్‌డ్రైనేజీ వ్యవస్థను తీసుకు రావాలని మంత్రులతో మాట్లాడానన్నారు. ఈ సమావేశంలో నాయకులు దేశాయ్ జయదేవరెడ్డి, సర్పంచ్ శరత్‌రెడ్డి, హైదర్‌ఖాన్, అంబేడ్కర్ చంద్రశేఖర్, బీసీ నాయకులు పాల్ బాలాజా, బాలక్రిష్ణారెడ్డి ఉన్నారు.
Back to Top