ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై వివక్ష

– మూడేళ్లుగా ఏ పని చేయలేదు
– ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి
– సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్‌

కోవెలకుంట్ల: ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై అధికారులు వివక్ష చూపుతున్నారని, ఎన్నికై మూడేళ్లు దాటినా ఇంతవరకు ఏ ఒక్క పని చేయలేదని, తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ పట్టణ ఐదవ ఎంపీటీసీ దిల్క్‌బాష ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ చెన్నకృష్ణమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చకు రాగా ఎంపీటీసీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీటీసీలను అధికారులు పట్టించుకోవడం లేదని ఏ అభివృద్ధి పని కేటాయించనప్పుడు ఇలాంటి సమావేశాలెందుకని సభ నుంచి వాకౌట్‌ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆరుమంది ఎంపీటీసీలు ఉండగా మండల సర్వసభ్య సమావేశాలతో ఒరిగిందేమిలేదని నలుగురు ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాలేదు. కేవలం ఇద్దరు మాత్రమే సమావేశానికి హాజరు కాగా మరో ఎంపీటీసీ సభను బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన అంశాలు చర్చకు రాగా మండలంలోని అమడాల, సౌదరదిన్నె, పట్టణంలోని పేట ప్రాథమికోన్నత పాఠశాలలను విద్యార్థులు లేని కారణంగా ప్రాథమిక పాఠశాలలుగా స్థాయి తగ్గించారని, లింగాల, చిన్నకొప్పెర్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని ఇక్కడ ఉపాధ్యాయులను సర్‌ఫ్లస్‌ చేసి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు ఎంఈఓ గోపాల్‌రెడ్డి చెప్పారు. జూన్‌ నెలకు సంబంధించి కార్డుదారులకు కిరోసిన్‌ అందలేదని జోళదరాశి గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకరాగా ప్రతి నెల 15వ తేదీకంతా కిరోసిన్‌ సరఫరా కావాల్సి ఉండగా ఈనెల 20వ తేదీ తర్వాత రావడంతో వెనక్కు పంపించినట్లు తహసీల్దార్‌ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అలాగే మండలంలోని లింగాల, రేవనూరు గ్రామాల్లో దీపం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు అందలేదని ఆయా గ్రామాల నాయకులు నాయుడు, నాగ ఉసేని సభలో ›ప్రస్తావించారు. దీపం పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గ్యాస్‌ కనెక్షన్లు వర్తింప చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన అ«ధికారులు సభలో ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గడ్డం నాగేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు సునీల్, నారాయణ, రమీజాబీ, ఉమామహేశ్వరమ్మ, ఏఎస్‌డబ్లు్యఓ లక్ష్మయ్య, సీడీపీఓ విజయలక్ష్మి, ఆర్‌డబ్లు్యఎస్, హౌసింగ్‌ ఏఈలు రవికిరణ్, రామసుబ్బన్న, ఈఓపీఆర్‌డీ ఉమామహేశ్వరరావు, ఉపాధి పథక ఏపీఓ రవిప్రకాష్, వెలుగే ఏపీఎం బాబు పాల్గొన్నారు.

Back to Top