కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గ రాజకీయ ఫలితమే!

హైదరాబాద్ 02 ఆగస్టు 2013:

కాంగ్రెస్ మనసులో ఉండే మాటను తానెలా చెప్పగలనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాను ప్రశ్నించారు. ప్రస్తుతం సీమాంధ్రలో సాగుతున్న సమైక్య ఉద్యమంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియా అభిప్రాయాన్ని కోరినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. 11మంది కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకమేనా అన్న ప్రశ్నకు మేకపాటి ఈ సమాధానం చెప్పారు. ఎంపీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ పీఠానికి బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు. ఇప్పుడు విభజన డిమాండ్లు దేశవ్యాప్తంగా వస్తున్న విషయాన్ని ఆయన ఉదహరించారు. దేశ క్షేమాన్ని కోరి ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నారు. స్వార్థ చింతనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుర్మార్గమని అభిప్రాయపడ్డారు.

రాజశేఖరరరెడ్డిగారు జీవించి లేకపోవడం.. ఉన్నవారికి చేతకాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని మేకపాటి ఆవేదన వ్యక్తంచేశారు. విరామం లేకుండా తామే ఈ దేశాన్ని పరిపాలించాలని ఓ కుటుంబం భావించడం, ఆ క్రమంలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డినీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనీ ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక చేస్తున్న రాక్షస క్రీడలే ఇవన్నీ అనీ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని నెలరోజుల్లో బయటకు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ఈ విభజన అంశాన్ని తెరమీదికి తెచ్చిందన్న టీడీపీ ఆరోపణలను  ప్రస్తావించగా 'చంద్రబాబు గారు ఏదైనా చెప్పగలరు.. చెప్పించగలరు.. ఆయన గొప్ప మేధావి. కానీ చాలా సందర్భాల్లో ఆయన తీసిన గోతిలో ఆయనే పడుతుంటారు. మనిషి సాధారణంగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులూ రావు. ఎత్తుగడలు వేసి వాటిలోనే చాలామంది రాజకీయ నాయకులు ఇరుక్కుపోతారు. అదే ప్రమాదం వచ్చింది' అని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు రాజీనామా చేస్తారని అడగ్గా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేస్తే ప్రయోజనం ఉంటుందనీ, మేము కూడా సరైన సమయంలో రాజీనామాలు సమర్పిస్తామనీ తెలిపారు.

అందరితో అన్ని విషయాలూ చర్చించి, ఆమోదయోగ్యంగా విభజన ప్రక్రియ చేసుంటే ఈ సమస్య ఉండేది కాదని మేకపాటి చెప్పారు. సమస్యను నాన్చి.. ఒక్కరోజులో ఎంత వడివడిగా అన్ని నిర్ణయాలూ తీసుకున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. రాజకోణం, స్వార్థం, దృక్పథం పెట్టుకుని విభజన చేసినట్లు సామాన్యుడికి కూడా అర్థమవుతోందన్నారు. అందుకే ఇబ్బందులొస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని పార్టీ కన్వీనర్ల రాజీనామాలను ప్రస్తావించినప్పుడు అది తాత్కాలికమేనన్నారు. రాజశేఖరరెడ్డిగారి మీద తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమానురాగాలున్నాయని పేర్కొన్నారు. స్వార్థ చింతన, లబ్ధి లేకపోవడం వంటి కారణాల వల్ల రాజకీయ నాయకులు వెళ్లిపోవచ్చు గానీ, తమ పార్టీని అభిమానించేవారు లక్షలాదిమందున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న క్షుద్ర రాజకీయానికి నిరసనగా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయాన్ని ఎన్నో సార్లు చెప్పామన్నారు.

కాంగ్రెస్, టీడీపీ మధ్య వ్యవహారం మోసగాళ్ళకు మోసగాడు మాదిరిగా ఉందన్నారు. తెలంగాణను చీల్చం, లేఖ ఇమ్మని కాంగ్రెస్ వారు అడిగి ఉంటారనీ అందుకే బాబు ఇచ్చి ఉంటారనీ మేకపాటి చెప్పారు. హిందుస్థాన్ టైమ్సులో వచ్చిన కథనం ఇందుకో ఉదాహరణన్నారు. తెలంగాణ ఇచ్చేసరికి ఆయన కంగారుపడి లీక్ చేసినట్టుందనీ, కానీ ఉపయోగం లేకపోయిందనీ ఆయన తెలిపారు. నిజంగా తెలంగాణ ఇవ్వాలన్న అంశంలో కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు.
దేశమంతా విభజనకు సంబంధించిన డిమాండ్లు రావడానికి ఆంధ్ర ప్రదేశ్ విభజన ఊతమిచ్చిందన్నారు. చిత్తశుద్ధి లేకుండా, ఆలోచించకకుండా చేసినందువల్లే ఈ పరిణామాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. పది సీట్లు ఎలా సంపాదించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనతో చేసిన నిర్ణయ ఫలితమే ఇదని మేకపాటి స్పష్టంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top