అక్రమ కేసులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా

  • ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు లేదా?
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదాలు
  • ప్రమాద ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు..
  • వైయస్‌ జగన్‌ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం
  • రాజకీయ కుట్రలో ప్రభుత్వం అధికారులను పావులుగా వాడుకుంటోంది
  • అధికారులంటే మాకే ఎంతో గౌరవం ఉంది
  • వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా రేపు రాష్ట్రవాప్తంగా ధర్నాలు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
హైదరాబాద్‌: ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉండదా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిన్న కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొందరు అధికార పార్టీ నేతలను తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్థసారధి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు..ఆయన ఏమన్నారంటే..

రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విధానం శోచనీయం. నిన్న కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికార యంత్రం చేసిన ప్రయత్నాలపై రాష్ట్రం మొత్తం కూడా ఒక అభిప్రాయానికి వచ్చింది. అధికార పార్టీకి సంబంధించిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో..వాళ్ల బస్సులు అన్నీ కూడా నిర్లక్ష్యంతో ప్రయాణికుల భద్రతపై ఏమాత్రం పట్టింపు లేకుండా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం నిద్రపోతున్నట్లు యాక్షన్‌ చేయడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో జరిగాయి, ఇకముందు కూడా జరుగుతాయనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అటువంటి సందర్భంలో సమస్యను పక్కదోవ పట్టించేందుకు, ప్రజల దృష్టిని మరల్చడం కోసం టీడీపీ ఒక కొత్త కథను డిజైన్‌ చేసి..అసలైన వాస్తవాలను మరుగున పరిచి, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 11 మంది ప్రాణాలు కోల్పొయి, 32 మంది తీవ్రంగా గాయపడితే రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ ఘటనకు గల కారణాలు విశ్లేషించకుండా  వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించి వేధించడం శోచనీయం, సిగ్గు చేటు. గత ప్రభుత్వాల్లో ప్రజాస్వామ్యా విలువలు ఉండేవి. ప్రతిపక్షం, పత్రికలు ఏదైనా తప్పును ఎత్తి చూపితే బాధ్యత గల ప్రభుత్వం, ముఖ్యమంత్రి అలాంటి ఘటనపై విచారణ చేసి వాస్తవాలు వెల్లడించేవారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకొన్న సంఘటనలు ఉన్నాయి. విలువలు కాపాడిన సందర్భాలు చూశాం. కానీ, ఈ రోజు ప్రభుత్వం ఎట్లా ఉందంటే..ఎవరూ ప్రశ్నించినా కూడా, వారిపై కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయస్‌ జగన్‌ ఏదో తప్పు చే శారని తప్పుడు కథలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అధికారులను ఏదో అన్నారని, దౌర్జన్యం చేశారని రకరకాలుగా కథలు రాస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనలు ఒక్కసారి పరిశీలిస్తే వాస్తవాలు అర్థమవుతాయి. 

శవాలను తరలించడంలో తొందరపాటు
నిన్న మేం అంతా కూడా అక్కడే ఉన్నాం. శవాలు వచ్చిన గంట నుంచే మృతదేహాలను పంపించేందుకు ప్రభుత్వమే వాహనాలు సిద్ధం చేసి తొందరపాటుతనాన్ని ప్రదర్శించింది. దానికి కారణమేంటో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మేం ఎక్స్‌గ్రేషియా గురించి అడిగాము. వాళ్లు కనీసం సానుభూతి కూడా లేకుండా, దుర్ఘటన జరిగిన దానికి పశ్చతాపం లేకుండా ముష్టి విదిల్చినట్లు రూ.5 లక్షలు అని మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఆసుపత్రికి రాగానే ఎదురుగా కలెక్టర్‌ కనిపించారు. ప్రమాదానికి గల కారణాలు ఎంటీ, అతివేగమా?, డ్రైవర్‌కు లైసెన్స్‌ఉందా?, డ్రైవర్‌ ఏమన్నా తాగి ఉన్నాడా?, పోర్టుమార్టం రిపోర్టు ఉందా అని వైయస్‌ జగన్‌ కలెక్టర్‌ను అడిగారు. పోస్టుమార్టం అయిపోయిందని కలెక్టర్‌ చెప్పారు. తరువాత మృతదేహాలు ఉన్న ఒక వార్డులోకి వైయస్‌ జగన్‌ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ..డ్రైవర్‌ తాగి ఉన్నాడా?అని ఒక డాక్టర్‌ను వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ మాటకు సమాధానంగా ఆ డాక్టర్‌ స్పందించారు. నేను కాదండీ..డ్రైవర్‌ బాడీని పోస్టుమార్టం చేసేందుకు విజయవాడ ఆసుపత్రి నుంచి డాక్టర్‌ నాయక్‌ వచ్చారని చెప్పారు. ఈ క్రమంలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..నాయక్‌ అన్నా డ్రైవర్‌ ఏమైనా మద్యం సేవించారా అని ప్రశ్నించారు. మీరు ఏమైనా కనుగొన్నారా?అని అడిగితే..ఇందుకు డాక్టర్‌ నాయక్‌ లేదని చెప్పారు. పక్కనే ఉన్న జగన్‌మోహన్‌రావు కూడా డాక్టర్‌ను ప్రశ్నించారు. కడుపులో కన్‌టెన్షన్‌ను మీరు పోస్టుమార్టంలో పరిశీలించి ఉంటారు కదా అని అడిగారు. తాగింది, లేనిది కడుపులో కన్‌టెన్షన్‌ చేస్తే తెలుస్తుంది కదా అని డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు ప్రశ్నించారు. అప్పటి వరకు శవాలను బయటకు ఎలా పంపించాలి అని ఆలోచన చేసిన ప్రభుత్వ అధికారులు అప్పుడు పోస్టుమార్టం చేయలేదని డాక్టరు చెప్పారు. ఇన్‌క్వేస్టు రిపోర్టు ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే చేస్తున్నామని డాక్టర్‌  చెప్పారు. శవాలను పంపించేందుకు మూటకట్టారు. దీనికి కారణం కలెక్టర్‌ చెబుతారా? ముఖ్యమంత్రి చెబుతారా?  ఇటువంటి దుర్ఘటనలో విమానాలు ప్రమాదానికి గురైతే బ్లాక్‌ బాక్స్‌ అంటాం. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్, ఆర్టీఏ అధికారులు టెక్నికల్‌ గ్రౌండ్స్‌ బట్టి చేసే విచారణ ముఖ్యమైంది. డ్రైవర్‌ను కనీసం పోస్టుమార్టం చేయకుండా మీరు ఎందుకు శవాన్ని పంపించే ప్రయత్నం చేశారు. డాక్టరే ఇన్‌క్వేస్టు రిపోర్టును వైయస్‌ జగన్‌కు స్వయంగా ఇచ్చారు. దాన్ని వైయస్‌ జగన్‌ విలేకరులకు చూపించి..ఇదిగోండి ఇన్‌క్వేస్టు రిపోర్టు మాత్రమే పెట్టుకొని పోస్టుమార్టం అయిపోయిందని చెప్పి మనల్ని తప్పుదోవ పట్టించి, ఎందుకు శవాలను పంపించేందుకు ప్రయత్నం చేశారని వైయస్‌ జగన్‌ అడిగినప్పుడు డాక్టర్‌ నాయక్‌ వైయస్‌ జగన్‌ చేతిలోని రిపోర్టును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వైయస్‌ జగన్‌ చేయి తీయ్యండి అన్నారు. అది తప్పా? ప్రతిపక్ష నాయకుడికి ఏమీ బాధ్యతలు ఉండవా?. ప్రతిపక్ష నాయకుడు దీన్ని రాజకీయం చేశారంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా కూడా మొట్టమొదట వైయస్‌ జగన్‌ అక్కడి వెళ్లి బాధితులను పరామర్శిస్తారు.  ఇటీవల విజయనగరంలో రైలు ప్రమాదం జరిగితే వెళ్లారు. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగితే వెళ్లి పరామర్శించారు. అప్పుడేందుకు ఈవిధంగా దౌర్జన్యం చేశారని వార్తలు రాయలేదు. అప్పుడు కూడా బాధితులను పరామర్శించి, అధికారులతో మాట్లాడి వచ్చారు కదా? ఈసారే ఎందుకు మీరు కథలు చిత్రీకరిస్తున్నారో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కేవలం ఈ దుర్ఘటన నుంచి మీ నాయకులను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించడం లేదా అని ప్రజలను అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు మూసుకొని పనిచేస్తోంది కాబట్టి మేం ఏం ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పడం లేదు. దీంతో మేం చేసిన తప్పేంటి అని ప్రజలనే అడుగుతున్నాం. ఏదైనా దుర్ఘటన జరిగిన ప్పుడు ఆ ఘటనలోని లోపాలను గుర్తించాలి. దాని ఆధారంగా రాబోయే రోజుల్లో నిబంధనలు అమలు పరచవచ్చు. అటువంటి కారణాలు వెత్తుకోక్కుండా ఎంతసేపు మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు. కలెక్టర్‌ను ఎవరూ ఏమీ అనలేదు. అన్నది ఒక్కటే..మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది శిక్షార్హమైన నేరమిది, జైలుకు వెళ్తారు అని చెప్పారు. ఇది వాస్తవం కాదా? 11 మంది ప్రాణాలు కోల్పొయి, 32 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి వెళ్తే ఈ ఘటన ఏవిధంగా జరిగిందని కారణాలు వెలికితీయకుండా, తప్పులను కప్పిపుచ్చుకునేలా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఆర్టీఏ అధికారులు కూడా ఈ ఘటన స్థలానికి వచ్చి ఎందుకు ప్రమాదం జరిగిందో పరిశీలించారా? అధికారులను వైయస్‌ జగన్‌ ఏమీ అనలేదు. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు ఆవిధంగా అన్నారు. అసలు ఈ ప్రమాదం ఏవిధంగా జరిగింది, ఎందుకు అధికారులను బలి చేసేందుకు రాజకీయ పావులుగా వాడుకుంటున్నారు. అధికారులకు కూడా మనవి చేస్తున్నాం. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అధికారులంటే పూర్తి గౌరవం, మర్యాదులు ఉన్నాయి. వారికి ఏదైనా సమస్యలు ఉంటే కాపాడే మనస్తత్వం ఉన్న నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డిని మీరందరు చూశారు. కేవలం ఈ రోజు అధికార పార్టీ వాళ్ల నాయకులను రక్షించుకునేందుకు అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. దయచేసి ఇందులోని వాస్తవాలు అధికారులు తెలుసుకోవాలని మేం వేడుకుంటున్నాం. మీరే పది మృతదేహాలకు పోస్టుమార్టం చేశామని చెప్పారు కదా? మీకు దమ్ముంటే జుడిషియల్‌ ఎంక్వైరీకి మేం డిమాండ్‌ చేశాం. ఉదయం 5.30 గంటల నుంచి స్టేజ్‌ క్యారియర్, లేదా కాంట్రాక్ట్‌ క్యారియరా?, కుక్క అడ్డం వచ్చిందా?  ప్రమాదం ఏవిధంగా జరిగిందో చెప్పాలి. ఎప్పుడు ఏం జరిగినా కూడా కుక్క అడ్డు వచ్చిందంటున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కారు ప్రమాదం చేసినప్పుడు కుక్క అడ్డువచ్చిందన్నారు. మరో మంత్రి కుమారుడు అమ్మాయితో అసభ్యంగా వ్యహరించిన ఘటనలో కూడా కుక్కనే అడ్డువచ్చిందన్నారు. ఈ ఘటనలో కూడా కుక్క అడ్డువచ్చిందా? లేదంటే బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా? లేదంటే డ్రైవర్‌ తాగి ఉన్నాడా?వీటన్నింటిపై విచారణ చేయించండి. నిన్నటి ఘటనలో రెండో డ్రైవర్‌ అనే వ్యక్తిని పట్టుకొని వచ్చారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్‌ చనిపోయాడు కాబట్టి రెండో డ్రైవర్‌ ఘటనపై మరిన్ని విషయాలు చెప్పే ఆస్కారం ఉంటుంది. అలాంటిది రెండో డ్రైవర్‌ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. మేం అడిగితే..వెళ్లిపోయాడు, మేం పట్టుకొని వస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.  ఇంత దుర్ఘటన జరిగితే మీరంతా క్యాజువల్‌గా తీసుకుంటారా? 11 మంది ప్రాణాలు మీకు లెక్కలేదా?. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యత గల ప్రభుత్వం వెంటనే ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై దాడులు నిర్వహించి ఎవరు స్టేజ్‌ క్యారియర్లుగా పనిచేస్తున్నారని తనిఖీలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు చేపట్టకుండా అక్కడివి వెళ్లిన వైయస్‌ జగన్‌పై ఎలాంటి కేసులు బనాయించాలని ప్రభుత్వం కుట్రలు చేయడం బాధాకరం. బస్సు ప్రమాదంపై ప్రభుత్వానికి పశ్చాతాపం లేదు. దమ్ముంటే జుడిషియల్‌ విచారణ చేపట్టాలి. పోస్టుమార్టం జరిగిన తీరుపై కూడా ఐఎంఏ అధికారులతో విచారణ చేపట్టాలి. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ  రేపు(మార్చి2)న అన్ని మండల కేంద్రాల వద్ద వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ధర్నాలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై నిరసన తెలపాలని, దిగజారుడు రాజకీయ విలువలకు, రాక్షస రాజ్యానికి నిరసనగా రేపు చేపట్టే నిరసనలో పాల్గొనాలని కోరుతున్నాం.
Back to Top