లాక్కున్న భూములు ‘ప్రైవేటు’కా?: ధర్మాన

హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయాలని టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలను వంచించడమేనని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. రాజధాని భూములను ప్రైవేటు కంపెనీలకు దోచి పెట్టేందుకే జీవో నెంబర్ 110ని మున్సిపల్ శాఖ జారీ చేసిందని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చే సదుపాయం ఈ జీవోలో కల్పించడం దారుణమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండే టీడీపీ ప్రభుత్వం ఏకంగా 99 ఏళ్ల పాటు భూములను లీజుకివ్వడం ఏమిటని  ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ జీవోను గోప్యంగా ఎందుకు జారీ చేసిందని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ సంప్రదించక పోవడం అప్రజాస్వామికమన్నారు. ఏపీ జెన్‌కోలో భారీ బొగ్గు కుంభకోణం జరుగబోతోందని దీనిని త్వరలో తాము బయట పెడతామని ధర్మాన హెచ్చరించారు. కాగా కన్నెధార కొండల్లో గ్రానైట్ మైనింగ్ లీజు వ్యవహారంలో తనపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి అధికార ప్రతినిధిగా ఉన్న తనపై ఇలాంటి దుష్ర్పచారానికి పూనుకుని అణచి వేయాలని చూస్తోందన్నారు.
Back to Top