ఏం ఘనత సాధించారని... రాజధానికి శంకుస్థాపన?

హైదరాబాద్: ఏపీ రాజధాని విషయంలో ఏం ఘనత సాధించారని టీడీపీ ప్రభుత్వం అక్కడ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనుకుంటోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. సింగపూర్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను రక్షించడం, తద్వారా తాము ప్రయోజనాలను పొందేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన ఘనతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడారు. రాజధాని పనుల కోసం టెండర్లు పిలవక ముందే.. తామే ఈ నిర్మాణాలను చేస్తామని సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలు ఘంటాపథంగా చెబుతున్నాయంటే టీడీపీ వారికి, ఆ కంపెనీలకు మధ్య కుదిరిన అవగాహన ఎంత బలమైనదో, వారి అనుబంధం ఎంత ధృఢమైనదో అర్థమవుతోందని అన్నారు.

స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణపు పనుల టెండర్లు పిలవడమంటే అందులో ఎవరు పాల్గొంటారు? అని ప్రశ్నించారు. ‘రాజధాని పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ సంబరాలు చేసుకోవడమేంటి? ఏం సాధించారని? రాజధానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చారా? రాష్ట్ర బడ్జెట్‌లో  కేటాయించారా? లేదు, అసలు ఎంతమంది రైతులకు పరిహారం చెల్లించారో చెప్పగలరా?’ అని ధర్మాన ప్రశ్నించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన తీవ్రంగా విమర్శించారు.
Back to Top