బాబు చర్యలన్నీ పతనంవైపే

  • మేనేజ్‌మెంట్‌ బాగా చేశామనడం విడ్డూరం
  • ప్రజాస్వామ్యం, చట్టాలకు తూట్లు పొడుస్తున్న సీఎం
  • వైయస్‌ఆర్‌ సీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటే టీడీపీ మైండ్‌ గేమ్‌
  • నంద్యాలలో 25 వేల మందికి టీడీపీ వ్యతిగత ప్రయోజనాలు 
  • బెదిరింపులు, ప్రలోభాలతో టీడీపీకి ఓట్లు
  • 50 ఉప ఎన్నికల్లో టీడీపీ ఒక్కటైనా గెలిచిందా.. బాబూ?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలన్నీ ఆయన పతనానికే దారి తీస్తాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల విజయం సాధించిన సందర్భంగా చంద్రబాబు మంగళగిరిలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారన్నారు. ఆ సమావేశంంలో చంద్రబాబు మాట్లాడిన అంశాలపై ధర్మాన ప్రసాదరావు స్పందించారు.  శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ధర్మాన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమాలకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పకుండా చంద్రబాబు పొల్, పొలిటికల్, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌లు బాగా చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన పరిపాలనపై ప్రజలంతా అసంసృప్తిగా ఉన్నారని ఆయనే అంగీకరించాడన్నారు. కేవలం మేనేజ్‌మెంట్‌ ద్వారానే ఎన్నికల్లో గెలవగలమని స్పష్టంగా నమ్మి వారి పార్టీ నేతలకు చెప్పారన్నారు. ఇలాంటి విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో 21 మంది శాసనసభ్యులను చట్టాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులకు విస్మయం కలిగేట్లుగా ఫిరాయింపులకు పాల్పడ్డారన్నారు. 

సంక్షేమాలు వెనక్కు తీసుకుంటామని భయపెట్టారు
నంద్యాల ఎన్నికల్లో 13,500ల మందికి ఇళ్ల పట్టాలు, 4 వేల మందికి తెల్లరేషన్‌ కార్డులు, 3 వేల మందికి పెన్షన్‌ మంజూరు చేసి ప్రోసీడింగ్‌లను అందజేసి చంద్రబాబు వ్యక్తిగత ప్రలోభాలకు పాల్పడ్డారని ధర్మాన మండిపడ్డారు. రాష్ట్రమంతా ట్రాక్టర్‌ల పంపిణీ ఉంటే నంద్యాలలో 600ల కుటుంబాలకు ట్రాక్టర్‌లను సబ్సీడీ కింద ఇచ్చారన్నారు. 2వేల మంది విద్యార్థులకు కంప్యూటర్లు ఇచ్చి వ్యక్తిగతంగా కుటుంబాలను ప్రలోభపెట్టే దుర్మార్గానికి  పాల్పడ్డారన్నారు. అదే విధంగా నంద్యాలలో రూ.12 వేల కోట్లతో అభివృద్ధి అని చెప్పి నమ్మించడానికి పనులు చేపట్టారన్నారు. టీడీపీని గెలిపించకపోతే.. ఇచ్చిన సంక్షేమాలు వెనక్కు తీసుకుంటామని భయపెట్టారన్నారు. అంతకు ముందు చంద్రబాబు నంద్యాల ఓటర్లకు చేతిలో రూ. 5 వేలు పెట్టి టీడీపీకే ఓటు వేయాలని భగవంతుడి ఫొటోపై ఒట్టువేయించుకున్నారని ధ్వజమెత్తారు. 

ఒక్క నియోజకవర్గానైనా అభివృద్ధి పర్చారా..?
నంద్యాల గెలుపు కోసం చేసిన కార్యక్రమాలు 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గానికైనా ఇచ్చారా ?అని ధర్మాన చంద్రబాబును ప్రశ్నించారు. దాదాపు 25 వేల కుటుంబాలకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించే పనిని ప్రభుత్వ నిధులతో చేశారన్నారు. నంద్యాలలో ప్రతి ఇంటికి రూ. 5 వేలు ఇవ్వబట్టే ఓట్లు వచ్చాయన్నారు. దాన్ని చూపించి టీడీపీకి తిరుగులేదని మాట్లాడడం చంద్రబాబు మైండ్‌ గేమ్‌ మాత్రమేనన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు డబ్బులు, పదవులు, టికెట్లు ఎరచూపి రాజ్యాంగానికి విరుద్ధంగా ఫిరాయింపులు చేయించారన్నారు. చంద్రబాబు అవినీతిని చూసి కేంద్రం సీట్ల పెంపుకు నిరాకరించిందన్నారు. 21 మందిని ఎక్కడ నుంచి నిలబెడతారని చంద్రబాబును ప్రశ్నించారు.

ఘనం విజయం అంటే నవ్వుతున్నారు బాబూ 
వైయస్‌ఆర్‌ సీపీ నేతలు టీడీపీకి టచ్‌లో ఉన్నారని చంద్రబాబు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు మాతో టచ్‌లో ఉన్నారని, తెలుగుదేశానికి ఓటు వేసి తప్పు చేశామని, వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి పనిచేస్తామని ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షం నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ప్రజల్లో ఎలా ఉందో తేలాలంటే ఎన్నికలు పెట్టాలని, ఫిరాయింపు దారులతో రాజీనామా చేయించి చంద్రబాబు ఎన్నికలకు రావాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు డబ్బు ఎక్కడ నుంచి తెస్తుందని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ప్రలోభాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం జరిగిందా అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని టీడీపీ చెప్పుకుంటే అందరూ నవ్వుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 174 నియోజకవర్గాల ప్రజలు కూడా రూ. 12 వేల కోట్లు ఇవ్వమని అడుగుతారన్నారు. 2004 నుంచి 2014 వరకు 50 ఉప ఎన్నికలు జరిగితే వాటిల్లో టీడీపీ ఒక్కటైనా గెలిచిందా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినట్లుగా క్లీయర్‌గా అర్థం అవుతుందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top