ధర్మానికి, న్యాయానికి విలువ లేదా?

అనపర్తి (తూర్పుగోదావరి జిల్లా),

8 జూన్‌ 2013: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న మన దేశంలో న్యాయానికి, ధర్మానికి, ప్రజాభిప్రాయానికి విలువ ఉందా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఒక నిర్దోషికి ఉన్న గుండె నిబ్బరాన్ని నిన్న జగనన్నలో రాష్ట్ర ప్రజలంతా చూశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆయనకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, ఒక తల్లి కడుపుకోతను, ఒక భార్య ఆవేదనని చూశారన్నారు. అభిమానంతో వచ్చిన ప్రజలను అడ్డుకున్న పోలీసుల ఓవరాక్షన్‌ని చూశారన్నారు. నిన్నటి దృశ్యాలను చూసిన ప్రతి గుండె బరువెక్కిందని, ఈ కుట్రలు ఇంకెన్నాళ్ళని అడుతుతున్నారన్నారు. ఈ దుర్మార్గుల పాపాలను దేవుడు లెక్కగడుతున్నారని హెచ్చరించారు. వీళ్ళ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

పది మంది బలహీనులు ఒక బలవంతుడ్ని పట్టుకోవచ్చేమో గాని చంద్రబాబు, కాంగ్రెస్‌ నాయకుల్లాంటి గుంటనక్కలు వంద వచ్చినా సింహం లాంటి జగనన్నను ఏమీ చేయలేవన్నారు. కొంతమంది స్వార్థం కోసమో, రాజకీయ వేధింపుల కోసమో చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేయవచ్చో అని మనం రుజువు చేస్తున్నామని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.  ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి నిస్సిగ్గుగా రక్షణ కవచంలా నిలుస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహార సరళికి నిరసనగా శ్రీ జగన్‌ తరఫున శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 173వ రోజు శనివారంనాడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కొనసాగింది. అనపర్తి దేవీచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

'శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద పెట్టింది కేవలం ఒక పొలిటికల్ కేసు. అంటే రాజకీయ కేసు. రాజకీయ కేసు తప్ప మరోటి కాదు. సిబిఐ అనే వ్యవస్థ కాంగ్రెస్‌ చేతిలో కీలుబొమ్మ అని.. కాంగ్రెస్‌ పంజరంలో చిలుక అని.. కాంగ్రెస్‌ పెరట్లో కుక్క అని.. కాంగ్రెస్‌ ఎవరి మీద మొరగమంటే వారి మీద మొరుగుతుందని.. అది ఎవరిని కరవమంటే వారిని కరుస్తుందనేది పచ్చి నిజం.' జగనన్న మీద ఉన్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాలేదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ఆయన మీద ఉన్నవి కేవలం అభియోగాలు, ఆరోపణలు మాత్రమే అన్నారు. చివరికి ఈడీ ధృవీకరించింది అంటున్న విషయాలు కూడా ఈ ఆరోపణలను ఆధారం చేసుకునే అని శ్రీమతి షర్మిల వివరించారు. ఆరోపణలు ఆధారం చేసుకుని ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఏడాది కాలం జైలులో ఉంచడం న్యాయమేనా అని ఆమె ప్రశ్నించారు.

నేరం రుజువు కాకుండానే ఒక వ్యక్తిని ఏడాది కాలంగా జైలులో ఉంచవచ్చని ఏ చట్టం చెబుతోందని నిలదీశారు. దోషి అని నిర్ధారించకుండానే ఆ వ్యక్తిని జైలులో పెడితే అతనికి శిక్ష వేసినట్లు కాదా? అన్నారు. జగనన్న నిర్దోషి అని తేలిన తరువాత ఈ సంవత్సరం కాలం జైలులో గడిపిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారని ప్రశ్నించారు. ఆయన జీవితాని ఒక సంవత్సరం పాటు వృథా చేసినందుకు ఎవరు బాధ్యత వహిస్తారని సూటిగా నిలదీశారు. ఆ బాధ్యత వహించే వారికి ఎంత శిక్ష విధిస్తే సరిపోతుందన్నారు. న్యాయస్థానాలు న్యాయం చూడాలని విజ్ఞప్తి చేశారు. వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెబుతోందన్నారు. మరి ఇక్కడేం జరుగుతోంది. ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఈ దేశ పౌరుడిగా హక్కు లేదా అని ప్రశ్నించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ పరిపాలన సువర్ణయుగంలా సాగిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలను ఆయన ముఖ్యమంత్రిలా కాకుండా కన్న తండ్రి మాదిరిగా అభిమానించారన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. ఇలాంటి పథకాలు రూపొందించాలని చేసి నిరూపించారని పేర్కొన్నారు.

చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్‌ ఇస్తే మహానేత వైయస్‌ 71 లక్షల మందికి ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఒక్క రూపాయి కూడా చార్జీలు గాని, ధరలు కాని, పన్నులు కాని పెంచలేదన్నారు.

మన దురదృష్టం కొద్దీ మహానేత రాజశేఖరరెడ్డి వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడున్న కిరణ్‌ ప్రభుత్వంతో ప్రజలంతా అల్లాడిపోతున్నారని ఆమె విచారం వ్యక్తంచేశారు. రైతులకు నీళ్ళు, కరెంటు, మద్దతు ధర లేక ప్రతి పంటకూ నష్టం వస్తోందన్నారు. అప్పులపాలైపోయి అల్లాడిపోతున్నారన్నారు. అన్ని ధరలు, చార్జీలు, ఖర్చులూ పెరిగిపోయాయని మహిళలు, పేదలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో బతుకే భారమైపోయి పిల్లల్ని బడికి పంపించలేక కూలికి తీసుకుపోతున్నారని విచారం వ్యక్తంచేశారు. కిరణ్‌ ఏలుబడిలో ఫీజు రీయింబర్సుమెంటు కుంటుబడిందన్నారు. ఆరోగ్యశ్రీకి జబ్బుచేసిందన్నారు. 108, 104 వాహనాలు కనుమరుగైపోయాయని వాపోయారు. పక్కా ఇళ్ళ పథకానికి ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాడె కట్టిందని దుమ్మెత్తిపోశారు. కిరణ్‌ ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేవని దుయ్యబట్టారు.

మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కిరణ్‌ ప్రభుత్వం అటకెక్కించిందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖరరెడ్డి బ్రతికే ఉంటే పుష్కర ఎత్తిపోతల పథకం ఈపాటికి పూర్తయి ఉండేదన్నారు. ఈ పథకాన్ని రూపొందించిన మహానేత వైయస్‌ అనపర్తి ప్రాంతంలో లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. ఆయన బ్రతికి ఉంటే మిగతా పనులు కూడా పూర్తయి మరిన్ని భూములకు నీళ్ళందేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూచిక పుల్ల కూడా కదపలేదని ఆరోపించారు. సిఎం కిరణ్‌ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదని విచారం వ్యక్తంచేశారు. సిఎం కిరణ్‌ మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు గడప కూడా దాటవని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలకు నిరసనగా ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన నిలబడకుండా తన రెండు చేతులూ అడ్డం పెట్టి ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని విప్‌ జారీ చేసి మరీ ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజల పక్షాన టిడిసి నిలబడి ఉంటే ఈ ప్రజా కంటక ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేదని, ఇప్పుడు మనకు ఈ చార్జీల మోత, ధరల భారం ఉండేదే కాదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కైపోయాయని ఆరోపించారు. ఈ అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడని విమర్శించారు. ప్రజలు ఎంతగా కష్టాల్లో ఉన్నారో పాదయాత్రలో చూసి కూడా చంద్రబాబు మనసు చలించలేదన్నారు. ఐఎంజి, ఎమ్మార్‌ కేసుల్లో తన మీద విచారణ జరగకుండా చేసుకునేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇలాంటి చంద్రబాబును నాయకుడంటారా? దుర్మార్గుడంటారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కయ్యారని శ్రీమతి షర్మిల విమర్శించారు. విలువలు, విశ్వసనీయతను చంద్రబాబు పక్కన పెట్టేశారన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు నీచమైన రాజకీయాలు చేసి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలుచేశాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న బయటే ఉంటే మహానేత వైయస్‌ వారసుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటారని వారికి కడుపుమంట అన్నారు. కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజం ఉన్నా వైయస్‌ బ్రతికి ఉన్నప్పుడే చేసేవారన్నారు.

Back to Top