దేవుడే దిక్కు... ఎ.పి ఆన్‌ రోడ్స్‌


పార్లమెంటులో ప్రత్యేక హోదా రగులుతోంది. 
లోక్‌సభలో ఐదుగురు ఎంపీలు. పిడికిళ్లంతా బలంతో పోరాడుతున్నారు. 
రాజ్యసభలో ఒకే ఒక్కడుగా గొంతెత్తి నినదిస్తున్నాడు విజయసాయి.
అందరిదీ ఒక్కటే మాట. ఒకటే రిక్వెస్ట్‌.
విన్నపాలు వినవలె..మొరలాలకించవలెనంటూ ’గొంతెత్తు’ అరుపులు.
 ’అసలు’ వాళ్లు వింటున్నారా? పట్టించుకుంటున్నారా?
ఇంతకూ అసలాయన...అడగ్గాల్సిన పెద్దాయన..పెదబాబుగారు ఎక్కడని వెదికితే అయనేమో దుబాయ్‌కి తుర్రుమన్నాడు. ఎందుకయ్యా అంటే ...’ఇక్కడ పెట్టుబడులు పెట్టండి’ అని అక్కడి వారిని అడగడానికట! త్వరలో వైజాగ్‌లో షరామామూలుగా జరిగే వ్యాపార, వాణిజ్య సదస్సుకు  ఆహ్వానించడానికట! ప్రత్యేకహోదా విషయంలో ఎన్నెన్ని మాటలు విన్నాం. ఎన్నెన్ని హామీలు విన్నాం. నాలుగేళ్ల ముందునాడు దండం పెట్టి మరీ మీకు కాక ఇంకెవరికిస్తాం అన్న గుండెలిప్పుడు రాతిబండలయ్యాయి. ఐదుకోట్లమందిని రోడ్లపాలు చేశాయి. దిక్కుతోచని పరిస్థితి. రేపంతా అగమ్యగోచరం. 
ఎన్నికల వేళ మనబాబుగారేమో...రాష్ట్రం తర్వాతే నా కేదైనా అన్నారు. ఢిల్లీకి పోవాలని లేదా? అని అడిగిన వాళ్లతో అదంతా జాన్తానై...’నేను నా దేశం’ పాట స్టయిల్‌లో ’నేనూ..నా రాష్ట్రమంటూ’ గుండెచీల్చుకున్నంత పనిచేస్తూ చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు మాత్రం   ఆయన ’ ఆ ..విధంగా ముందుకు’ పోతున్న తీరు చూస్తే మాత్రం..’రాష్ట్రం కథ మళ్లీ చూద్దాం...అమెరికా, జపాన్, సింగపూర్, దుబాయ్‌లకు టూర్లేద్దాం’ అన్నట్టుగా వుంది.
ప్రత్యేకహోదా మాటను పట్టించుకోకపోవడం..విభజన హామీలపై కూడా అడుక్కునే పరిస్థితి కల్పించడం చూస్తుంటే...
బాదేస్తోంది...గుండె మండుతోంది...మనసంతా బంగాళాఖాతమంత హోరవుతోంది.
ఇదంతా ఎవరి తప్పు!! గద్దెనెక్కితే చాలనుకుని హామీల మీద హామీలు  గుప్పించేసి..ఆ తర్వాత వాటిని గాలికి వదిలేసిన వారి తప్పుకాదా?
రాష్ట్రం కోసం ప్రత్యేకహోదా.. రాష్ట్రం కోసం విభజన హామీల కోసం ప్రజలే పోరాడాల్సి రావడం..ప్రజలే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం...నిజంగా ఎపి ప్రజల దురదృష్టం కాక మరేమిటి!
సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌నిప్పుడు ’ఎ.పి ఎట్‌ క్రాస్‌ రోడ్స్‌’ అనవచ్చేమో,. కాదూ కూడదంటే ’ఎ.పి ఆన్‌ రోడ్స్‌’ అనేయవచ్చేమో!
దేవుడా! రక్షించు నా రాష్ట్రాన్ని...కాపాడు నా రాష్ట్రాన్ని!!
’ఏమోనప్పా...వున్న పంచెను వూడగొట్టుకుని గోచిగుడ్డను అడుక్కున్నట్టుందప్పా’ ఇది సామాన్యుడి సణుగుడు!!
 సున్‌నే వాలా సున్‌నా పడేగా...జర దిల్‌ సే మదత్‌ దేనా పడేగా’
వినాల్సినవాళ్లు వినాలి...మనసుతో మద్దతు పలకాలి.
 

తాజా ఫోటోలు

Back to Top