కాంగ్రెస్‌ది విభజించి పాలించే సంస్కృతి: మేకపాటి

కడప 16 ఆగస్టు 2013: తాత్కాలిక ప్రయోజన లక్ష్యంతోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు యత్నిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్ జిల్లా కడపలో సమైక్యాంధ్ర డిమాండుతో పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది.  మేకపాటి శుక్రవారంనాడు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు.  సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్‌ పాలకులు మాత్రం విభజించు పాలించు అనే థోరణిలో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కాంగ్రెస్‌ చక్రబంధంలో చిక్కుకున్నారనీ.. అందుకే ఆయన తెలంగాణకు మద్దతు పలికారనీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరన్నారు.  తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసే లక్ష్యంతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు  పూనుకుందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి  ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని మేకపాటి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై బాబు రెండు కళ్ళ సిద్దాంతాన్ని పాటిస్తున్నారన్నారు. పాలకులు దేశ క్షేమాన్ని కాంక్షించాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలని తమ పార్టీ ముందు నుంచి చెబుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఈ సత్తా లేదని తమకు తెలుసనీ, అలాంటప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనీ కోరుతున్నామన్నారు. దేశ రాజధానిగా ఢిల్లీ కాకుండా మరో నగరాన్ని ఎలాగైతే ఊహించలేమో.. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ విషయమూ కూడా అంతేనని మేకపాటి చెప్పారు. 1956కు ముందు హైదరాబాద్ వేరనీ, ఇప్పటి నగరం వేరనీ, దీనిని మనమంతా కలిసి అభివృద్ధి చేసుకున్నామనీ ఆయన పేర్కొన్నారు. నగరాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకున్న విషయాన్ని మేకపాటి గుర్తుచేశారు. రాజధాని అనే ఉద్దేశంతోనే సీమాంధ్ర నుంచి ఎంతోమంది తరలి వచ్చి.. ఆస్పత్రులు, తదితరాలు నిర్మించుకున్నామన్నారు. సీమాంధ్రుల ఆందోళనలు తెలుసుకోకుండా ఆంటోనీ కమిటీ ఢిల్లీలోనే కూర్చుని రాజకీయ పార్టీలనుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరిస్తుందంటున్నారనీ, ఇది తగదనీ ఆయన హితవు పలికారు. పది ఎంపీ సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తారనే నమ్మకం తనకు లేదన్నారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి రెండు ప్రాంతాల్లో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ఈ నాటకమాడుతోందని చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేరని మేకపాటి స్పష్టంచేశారు. ఆందోళనలు ఇదే తీరుగా సాగితే ఢిల్లీ గద్దె దిగి రావలసిందేనని స్పష్టంచేశారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ తరవాత అతి పెద్దదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ విభజించలేరని కూడా ఆయన చెప్పారు. సోనియా పుత్రోత్సాహమే రాష్ట్ర విభజన చిచ్చని  పార్టీ నేత వైయస్ అవినాష్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు మనసులో సమైక్యమే ఉన్నా కాంగ్రెస్తో జతకట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

Back to Top