చైర్మన్‌ పదవి కోసం టీడీపీ విధ్వంసాలు

  • పదవుల కోసం ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తావా బాబూ!
  • డ్రామాలు ఆడి వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్‌లపై కేసులు
  • మెజార్టీతో మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకున్న వైయస్‌ఆర్‌ సీపీ
  • రాజ్యాంగంపై గౌరవం ఉంటే వారిపై బాబు చర్యలు తీసుకోవాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అదికార ప్రతినిధి పార్థసారధి

హైదరాబాద్‌: జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ విధ్వంసాలకు పాల్పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ సభ్యుడినని మర్చిపోయిన కేశినేని నాని దగ్గరుండి మరీ గొడవలు సృష్టించడానికి, అధికారులపై మానసిక ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాడని విమర్శించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడలో ఐపీఎస్‌ అధికారిపై దౌర్జన్యం చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరకీ తెలుసన్నారు. అదేరీతిలో జగ్గయ్యపేట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పోడియం వద్ద టీడీపీ నేతలు చుట్టుముట్టి కాగితాలు లాక్కొని చించి పారేశారన్నారు. ఇలాంటి దౌర్జనాలతో మున్సిపాలిటీలను దక్కించుకోవడం, కాంట్రాక్టులు సాధించి దోపిడీలు చేయించడాన్ని ప్రోత్సహిస్తున్నావా చంద్రబాబూ అని నిలదీశారు. ఐపీఎస్‌ అధికారిపై దౌర్జన్యం చేసినప్పుడే చర్యలు తీసుకొనివుంటే ఇలాంటి పరిస్థితి వచ్చివుండేది కాదన్నారు. 

మున్సిపల్‌ చైర్మన్‌ పదవి సాధించుకోవడానికి వైయస్‌ఆర్‌ సీపీకి మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నారని.. వారిపై రకరకాల కేసులు పెట్టించారని పార్థసారధి మండిపడ్డారు. ఒక కౌన్సిలర్‌ ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడని ఆయనిచ్చిన మెడిసిన్‌ వల్ల కడుపునొప్పి వచ్చిందని డ్రామా ఆడి కేసులు పెట్టించారన్నారు. వారి కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ ఇద్దరు కౌన్సిలర్లు, చైర్మన్‌ అభ్యర్థి రాజగోపాల్‌పై కూడా కేసులు పెట్టించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికను ఏదోరకంగా ఆపాలని రకరకాల వేధింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వెనకాల సీఎం చంద్రబాబు ఉన్నారని వైయస్‌ఆర్‌ సీపీ భావిస్తుందన్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైయస్‌ఆర్‌ సీపీ కట్టబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలును తిప్పికొడతామన్నారు. చంద్రబాబు రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఎన్నికల అధికారిపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top