పార్కుల ధ్వంసం తగదు

మదనపల్లె: పట్టణ నడిబొడ్డున ఉన్న రామ్‌నగర్‌ పార్కు జోలికి ఎవరైన వస్తే రణరంగమేనని వైయస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గుండ్లూరి షమీం అస్లాం మున్సిపల్‌ పాలకులు, అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు పలువురు క్రీడాకారులు చేపట్టిన ఆందోళనకు షమీం అస్లాం, కౌన్సిలర్‌ నీరుగట్టు వెంకటరమణారెడ్డి , మైఫోర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్‌లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రామ్‌నగర్‌ పార్కులోని క్రికెట్‌ క్రీడామైదానాన్ని  తొలగించి పార్కును అభివృద్ధి చేయాలన్న నిర్ణయం మున్సిపల్‌ పాలకులు , అధికారులు తీసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. 2005–10 సంవత్సరాల మధ్యలో దాదాపు రూ.20లక్షల ఖర్చుతో రామ్‌నగర్‌ పార్కులో షటీల్, టెన్నీస్, క్రికెట్‌ గ్రౌండ్‌ నిర్మించడం జరిగిందన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన ప్రభుత్వం అభివృద్ధి పేరుతో క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. పట్టణంలో రామారావుకాలనీ, ఎన్‌విఆర్‌ లేవుట్, పీఎన్‌టీకాలనీ తదితర ప్రాంతాల్లో పార్కులను మరింత అభివృద్ధి చేయాల్సివుండగా అభివృద్ధి జరిగిన పార్కులను ధ్వంసం చేయడం తగదన్నారు. పార్కుల అభివృద్ధి పేరుతో నాశనం చేయాలనుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు క్రీడకారులు పాల్గొన్నారు.

Back to Top