ఏపీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు

హైదరాబాద్ః ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా ఎల్లుండి చేపట్టనున్న రాష్ట్ర బంద్ ను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లుగా హోదాపై మభ్యపెడుతూ వచ్చిన టీడీపీ, బీజేపీలు... ఇచ్చిన హామీని విస్మరించి రాష్ట్రానికి కుచ్చుటోపీ పెట్టాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.  

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయి
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి
రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించడం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంతో న‌ష్ట‌పోయింద‌ని, దానికి తోడు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌రింత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హారిస్తూ రాష్ట్రాన్ని నష్ట‌ప‌రుస్తున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదాను నాటి కాంగ్రెస్ ఐదేళ్లు ఇస్తామంటే బీజేపీ ప‌దేళ్లు ఇవ్వాల‌ని, టీడీపీ ప‌దిహేనేళ్లు ఇవ్వాలంటూ రాష్ట్ర  ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి మోసం చేశాయ‌ని ఆమె విమ‌ర్శించారు. అర్థ‌రాత్రి ప్రత్యేక ప్యాకేజీని అరుణ్‌జైట్లీ ప్ర‌క‌టించ‌డం, దానిని సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్లే రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య తీరుతుంద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి సాధ్య‌మ‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా నేప‌థ్యంలో వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చిన రాష్ట్ర‌వ్యాప్త బంద్‌కు అంద‌రూ స‌హ‌క‌రించి విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. 

ఏపీ బిడ్డ‌ల భ‌విష్య‌త్‌ను నాశ‌నం చేస్తున్న బాబు
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి
హైద‌రాబాద్‌(అసెంబ్లీ మీడియా పాయింట్‌): త‌న స్వార్థపూరిత, రాజకీయ, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిడ్డ‌ల భవిష్య‌త్‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్న వ్య‌క్తి చంద్ర‌బాబు అని వైయ‌స్సార్‌సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌జాస్వామ్య విలువ‌లున్న పార్లమెంట్ సాక్షిగా దేశ ప్ర‌ధాని ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించారని... ఇప్పుడు ప్ర‌త్యేక ప్యాకేజీ అన‌డం సిగ్గు చేట‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన మాట‌కే దేశంలో చ‌ట్ట‌బ‌ద్దత లేకుండా పోవ‌డం దారుణ‌మ‌న్నారు. 40 - 50 సంవ‌త్స‌రాలు రాష్ట్రం వెన‌క్కి వెళ్లే దుస్థితి నెల‌కొంద‌ని, ఇక శాంతియుతంగా బాబును ప్ర‌శ్నించేది లేద‌న్నారు. త‌మ బిడ్డ‌ల భవిష్య‌త్ కోసం ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో పోరాటాలు చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి రాష్ట్రాన్ని వేడెక్కించే ప‌రిస్థితి తీసుకొస్తామ‌న్నారు. ప్ర‌త్యేక హోదాను సాధించే వ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌న్నారు. 

బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయి
ఎమ్మెల్యే అంజద్‌ బాషా
హైదరాబాద్‌: ఎన్నికల ముందు హోదా ఇచ్చితీరుతాం.. తెచ్చితీరుతామని చెప్పిన బీజేపీ, టీడీపీలు ప్రజలను తీవ్రంగా మోసం చేశారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంజద్‌బాషా ధ్వజమెత్తారు. నిన్న ఉదయం నుంచి రాష్ట్రానికి ఎదో జరుగబోతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ ప్రకటించి టోపీ పెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద అంజద్‌ బాషా మాట్లాడుతూ.. అర్థరాత్రి ప్రెస్‌మీట్‌పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీని స్వాగతిస్తున్నామని ప్రకటించడం దారుణమన్నారు. హోదా కోసం మొదటి నుంచి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని, రానున్న రోజుల్లో కూడా వైయస్‌ జగన్‌ నేతృత్వంలో హోదా సాధనే లక్ష్యంగా పోరాటాలు చేస్తామన్నారు. అదే విధంగా అత్యంత వెనుకబడిన రాయలసీమకు రూ. 25 వేల కోట్లు, ఉక్కు పరిశ్రమను ఇస్తామని చెప్పిన కేంద్రం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్లడం దుర్మార్గమన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అసెంబ్లీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. హోదా సాధన కోసం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 10వ తేదిన రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చారని, ఈ బంద్‌ను అన్ని పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో విజయవంతం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. 
Back to Top