ఆంధ్రుల ఆకాంక్షను బాబు తొక్కేస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ చేపట్టిన కలెక్టరేట్‌ల ముట్టడిపై ఆంక్షలు సరికాదు
హోదా కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడుతాం
విజయవాడ: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ చేపట్టిన కలెక్టరేట్‌ల ముట్టడిపై పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక హోదా కావాలని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక పోరాటాలు చేపట్టారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని దిక్కుమాలిన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు పోతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసులో ముద్దాయిగా ఉన్న బాబు రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి తాకట్టుపెట్టారన్నారు. హోదా సాధన కోసం ఎక్కడి వరకైనా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. 
హోదాని అడ్డుకునేందుకు బాబు కుట్ర: వెల్లంపల్లి శ్రీనివాస్‌ 
చంద్రబాబు నాయుడు హోదాను అడ్డుకునేందుకే వైయస్‌ఆర్‌ సీపీ ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బందరు రోడ్డుపై ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, కానీ వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాకు మాత్రం అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం చేసే పోరాటాన్ని ప్రభుత్వం తొక్కేస్తుందని మండిపడ్డారు. అయినా హోదా కోసం ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. 
 
Back to Top