బాబు మంత్రివర్గంలో రావణాసురులు

*విశాఖను డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చారు
*వేల కోట్లు ఎగ్గొట్టిన వారికి మంత్రి పదవులా
*గంటా, నారాయణల ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి
*బాబుకు రాష్ట్ర ప్రయోజనాలే పట్టడం లేదు
*వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం

విశాఖపట్నం: చంద్రబాబు కేబినెట్‌ రావణాసురులతో నిండిపోయిందని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళలపై వేధింపుల కేసుల్లో ఉన్న నలుగురిలో ఇద్దరు మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు.. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయాలు ఎగ్గొట్టినా సుజనా చౌదరికి కేంద్రంలో... రూ. వందల కోట్లు ఎగ్గొట్టినా గంట శ్రీనివాసరావుకు రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు.

ల్యాండ్ పూలింగ్ పేరుతో బావబామ్మర్ది గంట, నారాయణ దోచుకున్నారని ఆరోపించారు. వారిద్దరి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయికి విశాఖ అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా లిక్కర్‌ షాపులు విశాఖలోనే ఉన్నాయని తెలిపారు. బెల్ట్ షాపులు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరుండి గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యామా అని ప్రశ్నించారు.

టీడీపీ మంత్రులకు దోపిడీపై ఉన్న శ్రద్ధ విశాఖ రైల్వే జోన్ సాధనపై లేదని విమర్శించారు. ఓటుకు కోటు కేసు నుంచి బటయపడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌ నాథ్ చేపట్టబోతున్న పాదయాత్రకు అందరూ మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువుతో రైతులు, వ్యవసాయ కూలీలు అల్లాడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం ధ్వజమెత్తారు.
Back to Top