ఆంధ్రలో ప్రజాస్వామ్య విలువలకు పాతర

వైయస్‌ఆర్‌ జిల్లా: ఆఫ్ఘనిస్తాన్‌లోనైనా కొద్దోగొప్పో ప్రజాస్వామ్యం ఉంటుందేమో కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మెజార్టీ లేకపోయినా చంద్రబాబు పార్టీ అభ్యర్థిని నిలబెట్టి క్యాంపు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురిచేస్తూ, అక్రమంగా కేసులు బనాయిస్తూ, కిడ్నాప్‌లు చేస్తూ విచ్చల విడిగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా వైయస్‌ఆర్‌ సీపీకి అండగా నిలిచారన్నారు. వారందరికీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు కూడా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలీస్‌ స్టేషన్‌లలో ఓటర్లను కూర్చోబెట్టి దగ్గరుండి టీడీపీ క్యాంపులకు తీసుకువెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులైతే ప్రజాప్రతినిధులకు లక్షల్లో కాంట్రాక్టులు ఇస్తూ ఆకర్షిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలనే చంద్రబాబు నాయుడే రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. కడప జిల్లా వాసులు రౌడీలు, గుండాలు అని బాబు మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అనంతపురం లాంటి ప్రాంతంలో కూడా ఫ్యాక్షనిజం లేకుండా చేసిన వ్యక్తి దివంగత నేత వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. పోలీసులు వ్యవస్థల కోసం పనిచేయాలని, నాయకుల కోసం కాదని హితవుపలికారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top