డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడులను ఉపహరించవద్దు
విశాఖపట్టణంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో  వైయస్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జీరోఅవర్ లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ మినీ రత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటు కంపెనీలకు మేలు చేయటమే అని అన్నారు. డీసీఐ సేవలు దేశంలోని మేజర్ పోర్టుల్లోనే గాక విదేశాల్లోనూ అద్భుతంగా పనిచేస్తోందని, ప్రైవేటీకరణ వల్ల దేశసమగ్రతకు, రక్షణకు భంగం ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటే సమర్ధనీయం కానీ, లాభాల బాటలో పయనిస్తూ ఖజానాకు ఆదాయం కల్పించే సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించకోవడం అవివేకమైన చర్య అవుతుందన్నారు. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అలాంటి చర్యకే నడుం బిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
 డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) లోని మొత్తం 73.47 శాతం ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఉపసంహరణకు వ్యతిరేకంగా ఎంతోకాలంగా పోరాడుతున్న డీసీఐ ఉద్యోగుల మొరను ప్రభుత్వం ఎన్నడూ ఆలకించలేదనీ,  ఈ విషయంలో సాక్షాత్తు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చేసిన సిఫార్సులను సైతం ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
 
ప్రపంచంలోని టాప్‌ టెన్‌ డ్రెడ్జింగ్‌ కంపెనీలలో డీసీఐ ఒకటనీ, నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ మినీ రత్నంగా పేరు గడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  డ్రెడ్జింగ్‌ రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించి ప్రైవేటు డ్రెడ్జింగ్‌ కంపెనీలకు తిరుగులేని పోటీ ఇస్తోందన్నారు.
ఈ సంస్థ 2015–16 నుంచి లాభాల బాట పట్టిందనీ ,  సేతు సముద్రంలో డీసీఐ నిర్వహించిన డ్రెడ్జింగ్‌ పనులకు కేంద్ర ప్రభుత్వమే 500 కోట్లు చెల్లించాల్సి ఉందని సభ దృష్టికి తీసుకుని వచ్చారు.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా డీసీఐ అద్భుతమైన పనితీరుతో ముందుకు దూసుకుపోతోందని విజయసాయిరెడ్డి అన్నారు. 

రక్షణ పరంగా సమర్థనీయం కాదు

 డీసీఐని బంగారు పల్లెంలో పెట్టి ప్రైవేటు రంగ సంస్ధలకు కట్టబెట్టడానికి నిర్ణయించుకోవడం తీవ్ర విచారకరమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  దీని ప్రభావం దేశంలోని అతి పెద్ద పోర్టులపైనే కాకుండా భారత నౌకాదళంపై కూడా పడే అవకాశం ఉందన, ప్రైవేటు రంగంలోని డ్రెడ్జింగ్‌ కంపెనీలన్నీ జట్టు కట్టి అమాంతంగా రేట్లు పెంచేస్తే వారిని అదుపు చేయగల శక్తి ప్రభుత్వానికి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా భారత నౌకదాళ స్థావరాల్లోని కీలకమౌన, సున్నితమైన ప్రాంతాలలో ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతించడం ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదనీ. విచ్ఛన్నకర శక్తులు, తీవ్రవాదులు ఈ సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లోకి చొరబడే  ప్రమాదముందని హెచ్చరించారు.

సిబ్బంది భవిష్యత్తు అగమ్య గోచరం 

రాష్ట్ర విభజన అనంతరం పేరు మోసిన పరిశ్రమలన్నింటినీ కోల్పోయి ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతోందనీ, ఇప్పుడు డీసీఐని కూడా కోల్పోతే రాష్ట్రం పారిశ్రామికంగా మరింత వెనుకబడిపోతుందని ఎంపి అన్నారు.  డీసీఐ విక్రయం కారణంగా అందులో పనిచేసే దాదాపు 1700 మంది సిబ్బంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడమే కాక ,పరోక్షంగా దీనిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వేలాది మంది జీవితాలు రోడ్డున పడతాయన్నారు. డీసీఐని విక్రయిస్తే అంతర్వేదిలో 200 ఎకరాల విస్తీర్ణంలో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని తలపెట్టిన డ్రెడ్జర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ భవితవ్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. 

డీసీఐ ని కర విలువ కేలవం 1500 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం లెక్కగట్టింది. కానీ దాని బ్రాండ్‌ విలువ, గుడ్‌ విల్, డ్రెడ్జింగ్‌ కార్యకలాపాల నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో సంపాదించుకున్న అపారమైన అనుభవం.. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే డీసీఐ విలువ 10 వేల కోట్లు పైబడే ఉంటుందన్నారు.. మరి ప్రభుత్వం దీనిని కేవలం 1500 కోట్లకే తెగనమ్మాలని ఎందుకు నిర్ణయించింది..? ఈ చర్య ఏ విధంగా సమర్థనీయం..? అని అడిగారు.
 
డీసీఐని ప్రభుత్వం విక్రయిస్తే ఇక తన భవిష్యత్తు, తనపైనే ఆధారపడిన కుటుంబం భవిష్యత్తు ఏమైపోతుందోనన్న దిగులు, చింతతో ఆ సంస్థలో పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడు ఎన్‌. వెంకటేష్‌ ఇటీవలే ఆత్మహత్యలు పాల్పడిన దురదృష్టకర సంఘటన యావత్‌ డీసీఐ ఉద్యోగుల మానసిక స్థితికి అద్దం పడుతోందన్నారు.  

ఈ వాస్తవాల నేపథ్యంలో, కంపెనీకి గల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మున్ముందు డ్రెడ్జింగ్‌ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రవేశం వలన ఎదురయ్యే సమస్యలు, విపరిణామాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా.. డీసీఐ పెట్టుబడులను ఉపసంహించుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని, నౌకాయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తనకు మద్ధతు పలకాలని గౌరవ సభ్యులను ఆయన అభ్యర్థించారు.

Back to Top