ఇష్టారాజ్యంగా వార్డుల పునర్విభజన

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా శ్రీకాకుళం నగర వార్డుల పునర్విభజన చేపడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. అడ్డగొలు రాజకీయాలు చేసే టీడీపీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా నగర కమిషనర్‌ కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నగరంలో 36 వార్డులు ఉండగా  50 వార్డులుగా విభజించడటం ఏంటని మున్సిపల్‌ కమిషనర్‌ శోభను నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మిదేవి, ఆమె అనుచరులకు అనుగుణంగా వార్డులను విభజించారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి ఓట్లను తారుమారు చేశారని ధ్వజమెత్తారు. ఒక వార్డులో ఎక్కవ జనాభా, ఒక వార్డులో ఉన్న తక్కువ జనాభాను మరొక చోట చేర్చి అధికార అహంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వార్డులను పునర్విభజించేటప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్షం వైయస్‌ఆర్‌ సీపీ అభిప్రాయం కూడా తీసుకోలేదన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. వార్డుల ప్రక్రియ నీతిగా నిజాయితిగా జరగాలని సూచించారు. పెంచిన వార్డులను రద్దు చేయాలని కోరుతూ రెడ్డిశాంతి మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. 

Back to Top