ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటం

  • హోదా ఉద్యమానికి ఉప్పెనలా స్పందన
  • నాలుగేళ్లుగా ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌
  • అభివృద్ధి అంటే మీ ఆస్తులు పెంచుకోవడం కాదు బాబూ

విశాఖపట్నం: విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం అని నాలుగు సంవత్సరాలుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాల కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైయస్‌ జగన్‌ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుంచి స్పందన ఉప్పెనలా వస్తుందన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం అనేక రకాలు పోరాటాలు చేశామని, హోదా అవసరాన్ని గుర్తించాలని వివిధ రూపాల్లో కేంద్రంలోని పెద్దలకు వినతిపత్రాలు అందించడం జరిగిందన్నారు. చెవిటివాడి చెవిలో శంఖం ఊడినట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరు ఉందన్నారు.

తగిన రీతిలో ప్రజలే బుద్ధిచెబుతారు

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లాలూచీపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీని అంగీకరించిందని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్వార్థప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం, రాజీనామాలు చేయడమే తక్షణ కర్తవ్యమని బలంగా నమ్ముతూ ప్రతిపక్షం ముందుకు వెళ్తుందన్నారు. 

రాజీనామాలు చేసిన తరువాత కూడా పోరాటం

రాష్ట్ర అభివృద్ధి అంటే తాను, తన మంత్రులు, తన కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడమేనని చంద్రబాబు భావిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. నిజానికి ఆంధ్రరాష్ట్రంలో అభివృద్ధి ఇసుకరవ్వంత కూడా జరగలేదన్నారు. జీడీపీ, వృద్ధిరేటు అంటూ దొంగలెక్కలు చూపించి ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిన బీజేపీపై ఉందన్నారు. రాజీనామాలు చేసిన తరువాత కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. 
Back to Top