జేసీ సోదరుల అండతోనే దీపక్‌రెడ్డి భూకబ్జాలు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ప్రస్తుతం ఏ పత్రికలో, ఏ ఛానల్‌లో చూసిన దీపక్‌రెడ్డి భూకుంభకోణం వార్తలు మారుమోగుతున్నాయని తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జేసీ సోదరుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేసీ సోదరుల అండతోనే దీపక్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడన్నారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.  ఎక్కడ చూసిన జేసీ సోదరులు దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అడ్డుచెప్పిన అధికారులను సైతం బెదిరించి పనులు జరుపుకుంటున్నారన్నారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద మార్వాడిని బెదిరించి ప్లాస్టిక్‌ కవర్లు అమ్ముతున్నావని అతన్ని రోడ్డుపై ఈడ్చుకుని కొడితే పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిని తీవ్రంగా పరిగణించే పోలీసులు ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం పచ్చచొక్కా వేసుకుంటే వారి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. పచ్చ చొక్కా ముసుగులో ఎలాంటి అరాచకాలను చేయవచ్చనే ధోరణిని ప్రజలకు తెలియపరుస్తున్నారన్నారు.  గ్రామాల్లోకి వెళ్తే వీరి నీడ పడితే పిల్లలు నాశనమవుతారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. తమ ఇంటి ముందు మాత్రం పెద్ద బోర్డు వేసి చందాలు అడగరాదని రాయించారు. వీరు మాత్రం గతేడాది అమ్మవారి గుడి కోసం చందాలు, ఈ ఏడాది సాయిబాబా ఆలయం నిర్మించేందుకు చందాలు వసూలు చేస్తున్నారన్నారు. వాటితో తమ కుటుంబం మాత్రమే సస్యశ్యామలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారన్నారు. ఆయా గ్రామాల్లో ఫ్యాక్టరీలు రావడంతో పెద్ద ఎత్తున ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుందనే భావనతో ఉంటే అవి లేకుండా చేస్తున్నారన్నారు. వారికి ప్రజలు భయంతో గౌరవిస్తున్నారే తప్ప భక్తితో కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిధ్ధంగా ఉన్నారన్నారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడులకు పాల్పడడం వారికి జేసీ సోదరులకు అలవాటైపోయిందన్నారు. ఇలాంటి వారిపై పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి వారిని శిక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కుమ్మరి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Back to Top