దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు

హైదరాబాద్, 7 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష విరమించినందుకు ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. కరెంటు సమస్య ప్రజల దృష్టికి వెళ్లినందున దీక్ష విరమించాలని ఒక సీనియర్ సిటిజన్గా తాను వారిని కోరానని చెప్పారు.‌ తనలాంటివారి విజ్ఙప్తి మేరకు దీక్ష విరమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. గడచిన ఐదు రోజులుగా కరెంట్‌ సత్యాగ్రహం నిరవధిక నిరాహార దీక్ష చేసిత శ్రీమతి విజయమ్మకు, పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన, రైతు వెంకట్రామయ్య ఆదివారం ఉదయం నిమ్సు ఆస్పత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. దీక్షల విరమణ అనంతరం ఆయన నిమ్సు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు దీక్ష చేయడం వల్ల విద్యుత్ సమస్య ప్రజలలోకి వెళ్లిందని‌ పొత్తూరి వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రజల సమస్యలను శ్రీమతి విజయమ్మ చక్కగా వివరించారని అన్నారు. సమస్యలను శాసనసభ వేదికగా చర్చించాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను చర్చించాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్ రెడ్డికి‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Back to Top