దీక్ష @ బాబు డ్రామా డాట్ కామ్‌

  • పొట్టి శ్రీరాములును అవమానిస్తున్న చంద్రబాబు
  • ఇప్పటి వరకు చేసిన ప్రతిజ్ఞల్లో ఒక్కటైనా నెరవేర్చావా?
  • ఏం అభివృద్ధి చేశావని ఏపీని మొదటి స్థానంలో నిలబెడతావ్‌
  • చంద్రబాబుకు ప్రతిపక్షనేత అంటే భయం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌
  • విజయవాడ: నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు అమరజీవి పొట్టిశ్రీరాములును కించపరుస్తున్నాడని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. ప్రాణ త్యాగం చేసి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ను సాధించిన ఆయన్ను చంద్రబాబు తన స్వార్ధం కోసం అవమానపర్చే విధంగా వ్యవహరిస్తున్నాడన్నారు. నక్కను చూపి పులివాత పెట్టుకున్న చందంగా తెలంగాణ ఆవిర్భవ సంబరాలను చూసి ఏపీ సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు చేస్తున్నాడని విమర్శించారు. అక్టోబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాల్సివున్నా పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు నవనిర్మాణం పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవనిర్మాణ దీక్షలను చంద్రబాబు డ్రామా డాట్‌ కామ్‌గా ప్రజలంతా పరిగణిస్తున్నారన్నారు.

    మిత్రిపక్షమే ఛీ కొట్టడం సిగ్గుచేటు
    చంద్రబాబు ఇప్పటి వరకు అనేక ప్రతిజ్ఞలు చేశారు. వాటిల్లో ఒక్క శాతం అయినా నెరవేర్చారా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. నవనిర్మాణదీక్ష ప్రతిజ్ఞ ప్రజల ఆశలను అవహేళన చేసే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో దుర్మార్గపు హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పట్టపగలు నడిరోడ్డు మీద ప్రతిపక్షనేతలను హత్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రావణాసురుడికి పది తలలు ఉన్నా.. భోజనం మాత్రం ఒక్క తలతోనే చేస్తాడని, కానీ చంద్రబాబుకు ఒక్క తలకాయ ఉన్నా.. వందల తలలతో దోపిడీ చేయిస్తున్నాడన్నారు. మూడేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. బాబు అవినీతిని చూసి భయపడి మిత్రపక్షమైన బీజేపీ కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో సేవ్‌ బీజీపీ లీవ్‌ డీడీపీ అని ఫ్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారంటే ఇంతకంటే సిగ్గుచేటు అంశం మరొకటి ఉండదన్నారు.

    బాబు మూడేళ్ల పాలనంతా శూన్యం
    మూడేళ్ల పరిపాలనలో ఏం అభివృద్ధి చేశావని రాష్ట్రాన్ని మొదటి స్థానం నిలబెడతావు బాబూ అని వెల్లంపల్లి శ్రీనివాస్‌ చంద్రబాబును నిలదీశారు. రైతుల అప్పుల్లో, అవినీతిలో, మద్యం అమ్మకాల్లో, మహిళలపై నేరాలు చేసిన మంత్రుల్లో, పార్టీ ఫిరాయింపుల్లో, రైతుల భూములు లాక్కోవడంలో ఇలా అన్నింట్లోనే ఏపీని చంద్రబాబు మొదటి స్థానంలో నిలబెట్టాడని, అభివృద్ధిలో మాత్రం జీరో అని స్పష్టం చేశారు. 2022లో దేశంలోనే 3వ స్థానం, 2029లో దేశంలో మొదటి స్థానం, 2050లో ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీని నిలబెడతానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధంగా పాలన అంతా శూన్యంగా ఉంటే ఇండియా మ్యాప్‌లో ఏపీ చివరలో ఉంటుందని చెప్పారు. చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అంటే భయపట్టుకుందని విమర్శించారు. మహానాడు మొత్తం టీడీపీ వైయస్‌ జగన్‌ జపం చేశారన్నారు. చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి లేక వైయస్‌ జగన్‌పై విమర్శలకే మహానాడును ఉపయోగించుకున్నారన్నారు. 
Back to Top