'దీక్ష చేసే అర్హత టిడిపి ఎమ్మెల్యేలకు లేదు'

హైదరాబాద్, 27 మార్చి 2013: విద్యుత్ సమస్యపై‌ ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు నిరాహారదీక్ష చేయడం హాస్యాస్పదం అని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమా‌ర్ రెడ్డి ‌ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతునిచ్చి నిలబెట్టిన వారే ఇప్పుడు దీక్ష ఏ ముఖం పెట్టుకుని చేస్తారని ఆయన నిలదీశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బుధవారంనాడు హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. టిడిపి ఎమ్మెల్యేల తీరును తూర్పారపట్టారు.

చంద్రబాబు హయాంలో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించి పొట్టన పెట్టుకున్న ఉదంతాన్ని టిడిపి ఎమ్మెల్యేలు విస్మరించినా ప్రజలు మాత్రం ఆ దురాగతాన్ని ఇంకా మరిచిపోలేదని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బషీర్బా‌గ్లో ఉన్న విద్యు‌త్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, ప్రాయ‌శ్చిత్తం చేసుకుని టిడిపి ఎమ్మెల్యేలు దీక్షాస్థలానికి వెళితే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం సరికాదని, బోరు‌బావులను నిషేధించాలని తన 'మనసులో మాట' పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని ఎందుకు వదిలిపెట్టారో తెలియజేయాలని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‌గతంలో చేసిన తప్పిదాలను ఒప్పుకోకుండా ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు దీక్ష చేయడంలో అర్థం లేదన్నారు.

అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం‌పై ఓటింగ్‌ జరిగినప్పుడు కాంగ్రెస్కు అండగా నిలిచిన చంద్రబాబు ఇక నుంచి ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయానికి బాధ్యత వహించాల‌ని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన టిడిపి ఇప్పుడు వైయస్‌ఆర్ను వ్యతిరేకించడమే తన ‌ఎజెండాగా మార్చుకున్నదని ఆయన విమర్శించారు. మహానేత వైయస్‌ఆర్ హయాంలో విద్యు‌త్ సమస్యలే‌దన్నారు.‌ వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేసినందువల్లే ప్రజలు ఆయనకు రెండవసారి కూడా సంతోషంగా పట్టం కట్టారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గుర్తుచేశారు.
Back to Top