దావోస్ వెళ్లి ఏం సాధించారు బాబు..?

– ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌తో కమిటీ వేయాలి
– మీరు చెప్పేవన్నీ అవాస్తవాలే.. డీఐపీపీ లెక్కలే సాక్ష్యం
– మాయమాటలతో అందర్నీ అన్నిసార్లూ నమ్మించలేరు
– పది లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అబద్ధమే
–పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– ప్రజలకు వాస్తవాలు చెప్పడం ప్రతిపక్షం బాధ్యత 
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 

హైదరాబాద్ః సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి అబద్ధాల ప్రచారానికి సిద్ధమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సీఐఐ సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులన్నీ వాస్తవాలైతే ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌తో ఓ కమిటీ వేయించి శ్వేతపత్రం విడుదల చేయాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట చేస్తున్న ప్రచారాన్ని అబద్ధాలని ఆధారాలతో సహా నిరూపించారు. సాక్షాత్తు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సమక్షంలోనే అబద్ధాలను నిర్మొహమాటంగా ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమన్నారు. 

13 సార్లు దావోస్, 7 సార్లు సీఐఐతో ఏం సాధించారు
చంద్రబాబు ఇప్పటికే 13 సార్లు దావోస్‌ వెళ్లి ఏం సాధించారని బుగ్గన ప్రశ్నించారు. ప్రచారం పేరిట సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్క పెద్ద పరిశ్రమైనా ఏపీకి వచ్చిందా.. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం కల్పించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 జాతీయ పత్రికల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనుకోవడం పొరపాటని హితవు పలికారు. దావోస్‌ పర్యటనలతో ఇప్పటికే వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం కావడమే తప్ప ఏం ఒరగబెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రూ. 6.5లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామని చెప్పుకుంటే మీరు మాత్రం 4.5 లక్షల కోట్లే సాధించామని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో ఏం సాధించారని ఎద్దేవా చేశారు. 

అబద్ధాలతో అన్నివేళలా నమ్మించలేరు
అబద్ధాలు చెప్పుకుని ప్రజలను ఎళ్లకాలం నమ్మించలేరని బుగ్గన పేర్కొన్నారు. ‘అబద్ధాలతో ఒకడ్ని అన్నిసార్లు నమ్మించవచ్చు.. అందర్నీ ఒక్కసారి నమ్మించవచ్చు.. కానీ అందర్నీ అన్నిసార్లూ నమ్మించలేర’ని అబ్రహం లింకన్‌ చెప్పిన మాటలను గుర్తుచేశారు. బాటా లెక్కలతో అబద్ధాలు నిజమయ్యే పనైతే అందరూ వాటినే నమ్ముతారని ఎద్దేవా చేశారు. చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు పట్టుకుని ప్రజలను నమ్మించాలని మీరు ఎంత స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారో.. మీకంటే స్మార్ట్‌గా ప్రజలున్నారని తెలిపారు. టీడీపీ నాయకులంతా ఆకాశంలో చుక్కలమని తేలిపోతున్నారని మీ సోకులన్నీ కిందనుంచి జనం చూస్తున్నారని ఆయన ఛలోక్తులు విసిరారు.

మీ ప్రచారంతో హైదరాబాద్‌ బిర్యానీకి పేరొచ్చింది.. 
చంద్రబాబు నిర్వహించిన సీఐఐ సదస్సులతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కేవలం హైదరాబాద్‌ బిర్యానికే పేరొచ్చిందని ఎద్దేవా చేశారు. మీరిచ్చే పంపే చార్మినార్‌ బొమ్మలతో చార్మినార్‌ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసిందన్నారు. జీఎస్టీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా పనిలేదని యనమల రామకృష్ణుడు చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. జీఎస్టీ వచ్చినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న విషయాన్ని ఆర్థిక మంత్రిగా ఉన్న మీరే మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు రావా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో సుజనా చౌదరి మాటలను బుగ్గన ఆక్షేపించారు. ప్రజా ఉద్యమాలను అంత చులకన చేసి మాట్లాడటం తగదని ప్రజలెవరూ అమాయకులు కాదని.. మీకన్నా ఉత్సాహంగా ఆలోచిస్తారని ఆయన పేర్కొన్నారు. 

డీఐపీపీలో ఆ కంపెనీలేవీ 
డీఐపీపీ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌) లెక్కల ప్రకారం బాబు చెప్పినట్లు అన్ని కంపెనీలు రాలేదని బుగ్గన తేల్చేశారు. పరిశ్రమ పెట్టిన అందరి వివరాలు అందులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ పెట్టాలనుకున్న వారు తప్పనిసరిగా ఐఈఎం (ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మెమోరాండమ్‌) సమర్పించాల్సి ఉంటుందని వారు ఇచ్చిన ఇండస్ట్రియల్‌ లైసెన్సుతోనే పెట్టుబడులు వస్తాయని వివరించారు. ఈ వివరాలు ఎవరికీ తెలియవని ప్రజలను మోసగించేందుకు తప్పుడు బాటా లెక్కలతో ప్రచారం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎమ్‌ఈలకు తప్ప ప్రతి కంపెనీ ఐఈఎంలో రిజిస్టర్‌ కావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. 

గతేడాది ఏపీకి వచ్చింది రూ. 11,395 కోట్లే
ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టు ఏపీకి గతేడాది 4.5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని 99 కోట్లు పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయని చెప్పడాన్ని బుగ్గన తప్పుబట్టారు. కేవలం 11, 395 కోట్లు మాత్రమే వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. దేశం మొత్తానికి కలుపుకుంటే వచ్చింది లక్షా ఐదు వందల కోట్లేనని వివరించారు. కాగా అందులోనూ 40వేల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందన్నారు. మనకొచ్చిన పెట్టుబడుల్లో అన్ని స్పిన్నింగ్‌ మిల్లులు, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులేనని తెలిపారు. దాదాపు పదేళ్ల వరకు దేశంలోనే మిగులు విద్యుత్‌ ఉంటే తెచ్చుకుని ఏం చేసుకుంటావని విమర్శించారు. ఆ వచ్చినవి కూడా బిజినెస్‌ ఎక్స్‌పాన్షన్‌ అని అమర్‌రాజా వంటి వారిని బతిమిలాడి పెట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. 

ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ కాదు.. ఈజ్‌ ఆఫ్‌ లైయింగ్‌
రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ జరగడం లేదని ఈజ్‌ ఆఫ్‌ లైయింగ్‌ మాత్రమే జరుగుతోందని బుగ్గన ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తున్న వరకు ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ హయాంతో పోల్చి లెక్కలతో సహా వివరించారు. వాస్తవాలకు బాబు చెప్పుకుంటున్న మాటలకు ఎక్కడా పొంతన లేదని నిరూపించారు. ఆయన చెప్పుకునే అభివృద్ధి కేవలం పేపర్లలోనే ఉందన్నారు. 

పర్‌ కాపిటా ఇన్‌కమ్‌ 
చంద్రబాబు రాకముందు (1993–94)     రూ. 15,502
చంద్రబాబు హయాంలో  (1994–2004)    రూ. 23,448
వైయస్‌ హయాంలో (2004–09)           రూ. 89 వేలు
చంద్రబాబు 8 వేలు పెంచగా.. వైయస్‌ఆర్‌ హయాంలో 65 వేలు పెరిగింది.
స్థూల ఉత్పత్తి శాతంలో
1984–94 5.9 శాతం
1994–045.7 శాతం
2004–099.6 శాతం
బాబు హయాంలో .2 శాతం తగ్గగా వైయస్‌ హయాంలో రెట్టింపైంది
పరిశ్రమల స్థాపన 
1984–94 8 శాతం
1994–046.5 శాతం (తగ్గింది)
2004–09 11 శాతం – పెరుగుదల 
వైయస్‌ఆర్‌ హయాంలో దాదాపు రెట్టింపు పెరుగుదల 

పెట్టుబడులకు దావోస్‌ వెళ్లాలా..?
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే దావోస్‌ వెళ్లాలా.. లేదంటే రావా అని బుగ్గన ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దావోస్‌ వెళ్లకుండానే మీకంటే రెట్టింపు అభివృద్ధి సాధించారుగా అని ఎద్దేవా చేశారు. కరుణానిధి, జయలలితలు దావోస్‌ వెళ్లకుండానే వందల కిలోమీటర్ల పారిశ్రామిక కారిడార్‌లు తమిళనాడులో ఏర్పాటు చేసుకోలేదా అని ప్రశ్నించారు. మీ పర్యటనలు, పేపర్‌ పబ్లిసిటీ మూలంగా వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడమే ప్రతిపక్షం లక్ష్యమని తామూ అదేపని చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అబద్ధాలను ప్రచారం చేసుకుని అదే అభివృద్ధిగా ప్రజలను నమ్మించాలని చూస్తుందని ఆరోపించారు. ఇలాంటివి ఎంతోకాలం సాగవని ప్రజలు అమాయకంగా లేరని హితవు పలికారు. సీఐఐ పెట్టుబడ్డులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top