దళితుల పట్ల సీఎంకు చులకన భావం తగదు

రాజంపేట టౌన్ః ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల పట్ల చులకన భావం కలిగివుండటం తగదని వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ దండు గోపి మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సీఎంను పత్రికా ముఖంగా కోరిన ఎంపీ శివప్రసాద్‌పై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. శివప్రసాద్‌ దళితుడైనందునే ముఖ్యమంత్రి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని తెలిపారు. మంత్రి పదవులు రాకపోవడంతో చంద్రబాబుపై పత్రికా ముఖంగా దుమ్మెత్తిపోసిన ఎమెల్యేలు బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్‌చౌదరిలపై సీఎం మాటమాత్రమైనా మందలించక పోవడం ఆయనకు అగ్రవర్ణాలపై ఉన్న అభిమానాన్ని, దళితుల పట్ల ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తుందన్నారు. ఎంపీ శివప్రసాద్‌ తొలి నుంచి ముఖ్యమంత్రికి ఎంతో అనుకూలంగా ఉంటారని, అయితే చంద్రబాబునాయుడు దళితులకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఎంపీ శివప్రసాద్‌ బహిరంగంగా ప్రకటించడాన్ని బాబు జీర్ణించుకోలేక పోగా, దళితుడైన శివప్రసాద్‌పై అవాకులు చెవాకులు పేలడం సిఎంకు తగదన్నారు. 

రాష్ట్రంలో దళితులు తొలి నుంచి వైయస్‌ కుటుంబం వెంట ఉన్నారని, ఇందువల్లే దళితుల అభ్యున్నతి గురించి చంద్రబాబునాయుడు ఎప్పుడు కూడా పట్టించుకోలేదన్నారు. గత ఎన్నికల్లో కూడా దళితులు వైయస్సార్‌సీపీకి అండగా నిలిచారని, ఇందువల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా దళితుల జీవన ప్రమాణాలు మెరుగు పడేందుకు ఎలాంటి పథకాలను కూడా ప్రవేశ పెట్టలేదని ఆరోపించారు. దళితులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ విషయంలో అనేక ఆంక్షలు పెట్టి ఉచిత విద్యుత్‌ కూడా దళితులకు అందకుండా చేశారని దండు గోపి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు దళితుల పట్ల చులకన భావాన్ని విడనాడాలని, లేకుంటే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న దళితులంతా ఏకమై తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Back to Top