దళితుల మధ్య 'బాబు' చిచ్చు

గుంటూరు:

రాష్ట్రంలో దళితుల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వర్గీకరణ చిచ్చుపెడుతున్నారని  వైయస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు చెప్పారు. గుంటూరులోని పార్టీ  జిల్లా  కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై పార్టీ ఎస్సీ విభాగం నగర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉందనీ, చంద్రబాబు దీనిపై ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారనీ ఆరోపించారు. అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలు మాల, మాదిగల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.  మహానేత డాక్టర్ వైయస్  రాజశేఖరరెడ్డి అర్హులైనప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించారన్నారు. సంపదను దళితులకు పంచుదామని వైయస్ అనుకుంటే, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేదరికాన్ని పంచుతున్నారని చెప్పారు. సబ్ ప్లాన్ చట్టబద్ధత వల్ల ప్రయోజనం లేదని వైయస్ అమలు చేసిన నోడల్ ఏజెన్సీనే అమలుచేయాలని ఆయన కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ మహానేత దళితుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేశారన్నారు. పార్టీ నాయకులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టబద్ధత పేరుతో దళితులను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు.  ప్రభుత్వం కావాలని వైయస్ చేపట్టిన పథకాలకు తూట్లుపొడుస్తోందన్నారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు,  ఎస్సీ విభాగం నగర కన్వీర్ వై.విజయ్‌కిషోర్  తదితరులు పాల్గొన్నారు.

Back to Top