నగరి: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దళితులు సోమవారం నగరిలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే రోజాపై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేయాలని దళితులు నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రయువజన కార్యదర్శి శ్యామ్‌లాల్, నత్తం కృష్ణమూర్తి తదితర ఐదు మండలాల దళితనేతల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.<br/>మున్సిపల్ కార్యాలయ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి ర్యాలీ బయలుదేరి ఓం శక్తి దేవాయలయం వద్దకు చేరుకుంది. అక్కడ దళితులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంటే ఎమ్మెల్యే రోజాకు ఎంతో అభిమానమని, వారి ఇంట జరిగే శుభాకార్యాలకు అందరికి కంటే ముందుగా ఉంటూ వారిని ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు ఇది చేస్తా, అది చేస్తా అని ఆశ చూపించి ఓట్లు దండుకుని ఇప్పుడు అనేక కారణాలు చూపించి మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.<br/>నగరి మాజీ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు నేడు దళితులపై కపట ప్రేమను చూపించి తమలో తమకు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. నిజంగా ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రోజా దళిత వ్యతిరేకి అని అభాండాలు వేయించి తమలో చీలిక తేవడానికి ప్రయత్నించే నీచ రాజకీయాలను ఆయన మానుకోవాలని హితవు పలికారు. అటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా నెరవేరవ రని, తమ హృదయాల్లో స్థానం సంపాదించి తమ కోసం పోరాడుతున్న నేత ఎవరో తమకు స్పష్టంగా తెలుసునని చెప్పారు. కుట్రపూరిత పన్నాగాలకు తాము లోబడమని హెచ్చరించారు. తమ లో తమకు చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోకుంటే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని, దళితులు టీడీపీలో ఉండే పరిస్థితి లేదని తీవ్రంగా హెచ్చరించారు.<br/>ఈ ధర్నా,రాస్తారోకోలో మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి, వైస్ చైర్మన్ నీలమేఘం, చంద్రారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. కొం దరు నాయకులు రాజకీయంగా ఎదుర్కొలేక ఎస్సీ, ఎస్టీలను రెచ్చకొట్టి నడిరోడ్డుకు ఈడుస్తున్నారని వారు విమర్శించారు. దళితనాయకులు ఆర్ముగం, సుబ్రమణ్యం, యోహాన్, యకోబ్, రవి, శీన, వజ్రవేలు, రాజాముత్తు, చిన్నదొర, పిచ్చెమ్మ (కౌన్సిలర్) దినకర్, సీఫెన్, సెల్వం, బాలన్, అమ్ములు, మురుగన్, తెరణిరవి, శేఖర్, కన్నప్ప, గోవర్థన్, శేఖర్, నాటరాజన్, ధనపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, కేజే సురేష్, యువరాజ్, రాజాదాస్, తదితరులు పాల్గొన్నారు.