రాష్ట్ర విభజన తెలుగుజాతికే అవమానకరం

విశాఖపట్నం, 1 ఆగస్టు 2013:రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం తెలుగుజాతికే అవమానకరం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఇలా ముక్కలైపోవడానికి ప్రధానంగా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ అని ఆయన మండిపడ్డారు. టిటిడి దర్శనాల కోసం రాసే ఉత్తరాల మాదిరిగా లేఖల మీద లేఖలను చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాశారని దుయ్యబట్టారు. బలీయమైన సమైక్యాంధ్రను రాజకీయంగా బలహీనం చేయాలన్న దురుద్దేశంతోనే కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని విమర్శించారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారంనాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి, చంద్రబాబు, సోనియాగాంధీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు, తెలంగాణవాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఉత్తరాల మీద ఉత్తరాలు ఇచ్చిపారేశారని దాడి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంత ద్రోహం చేసిందో తెలుగుదేశం కూడా అంతే చేసిందన్నారు.

Back to Top